తెలంగాణ అంటే కల్వకుంట్ల ఇల్లు కాదు.. బీసీని కాబట్టే అవమానించారు!: కొండా సురేఖ
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఇటీవల ప్రకటించిన 105 మంది అభ్యర్థుల తొలి జాబితాలో తనకు చోటు దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీసీ మహిళను అన్న కారణంతోనే తనను అవమానించారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం తననే కాకుండా రాష్ట్రంలోని బీసీలను, తెలంగాణ మహిళలు అందరినీ అవమానించినట్లేనని అన్నారు.

తెలంగాణ అన్నది కల్వకుంట్ల ఇల్లు కాదనీ, అది రాష్ట్రమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పాత వరంగల్ లోని 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల అభ్యర్థులను ప్రకటించి తన సీటును మాత్రం ప్రకటించకపోవడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ రోజు హైదరాబాదు, సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సురేఖ, తన భర్త మురళీతో కలసి మాట్లాడారు.

2014లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకున్నాననీ, కానీ టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా తమపై ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. పార్టీలో చేరాలని పదేపదే వర్తమానాలు పంపారనీ, తాము పరకాల టికెట్ ఇస్తేనే వస్తామని స్పష్టం చేశామని సురేఖ తెలిపారు. తనను వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాల్సిందిగా సమావేశంలో కేసీఆర్ కోరారని చెప్పారు.

బసవరాజు సారయ్యను మీరు తప్ప ఎవ్వరూ ఓడించలేరని అప్పట్లో కేసీఆర్ తమతో అన్నారని సురేఖ పేర్కొన్నారు. పార్టీలో చేరితే తనకు మంత్రి పదవి, తన భర్త మురళీకి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారనీ, ఆ మాటను ఇప్పటివరకూ నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. తాము వరంగల్ లో రెండు సీట్లు డిమాండ్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి పొమ్మని చెప్పలేక తమకు పొగపెట్టారని ఆమె విమర్శించారు. తమ ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని మండిపడ్డారు. 105 అభ్యర్థుల జాబితా తర్వాత ఫోన్ చేస్తే కేటీఆర్, హరీశ్ రావు ఫోన్ ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం పార్టీలోకి రావడం హరిశ్ రావుకు ఇష్టం లేదనీ, తనకు పార్టీ టికెట్ రాకపోవడానికి కారణం కేటీఆరేనని సురేఖ స్పష్టం చేశారు.

పరకాల వదిలి వరంగల్ ఈస్ట్ కు వెళ్లాలని చెప్పారని, తమకు ఇష్టం లేకపోయినా పార్టీ కోసం వెళ్లామని, వరంగల్ ప్రజలు 55,000 ఓట్ల మెజారిటీతో తనను ఆశీర్వదించారని కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ఈస్ట్ లో కులమతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టామనీ, అయినా తమకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో టీఆర్ఎస్ అధిష్ఠానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశామనీ, సొంత డబ్బులు పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. తమ వ్యతిరేకులను పార్టీలోకి తీసుకున్న సమయంలోనూ పార్టీ అధిష్ఠానం తమకు కనీస సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మహిళలకు కేబినెట్ లో చోటు ఇవ్వని ప్రభుత్వంగా కేసీఆర్ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని సురేఖ వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవుల మీద ఆశ లేదనీ, నియోజకవర్గంలో అభివృద్ధి జరిగితే చాలని స్పష్టం చేశారు. భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్ లో తమ కుటుంబం పోటీ చేస్తుందని సురేఖ స్పష్టం చేశారు.
Sat, Sep 08, 2018, 12:14 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View