ఒకేచోట బయటపడిన 166 పుర్రెలు.. మెక్సికోలో బయటపడుతున్న శ్మశాన గుంటలు!
Advertisement
మెక్సికోలో బయటపడిన సామూహిక సమాధులు ఆశ్చర్యపరుస్తున్నాయి. వందల మృతదేహాలు వెలికి వస్తుండడంతో ప్రపంచం దృష్టి మొత్తం ఇటువైపు మళ్లింది. ఒకేచోట పదుల సంఖ్యలో ఉన్న సమాధుల గుంటల (పిట్స్) నుంచి దర్యాప్తు అధికారులు మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. తాజాగా గల్ఫ్ కోస్ట్ రాష్ట్రమైన వెరాక్రజ్‌లో అతి పెద్దదైన శ్మశానం బయటపడింది. ఓ పిట్‌ను తవ్వి చూడగా అందులో నుంచి ఏకంగా 166 పుర్రెలు బయటపడ్డాయి.  

భద్రతాపరమైన కారణాల రీత్యా వీటిని సరిగ్గా ఎక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నదీ చెప్పలేమని వెరాక్రజ్ స్టేట్ ప్రాసెక్యూటర్ జార్జ్ వింక్లెర్ తెలిపారు. వీటిని రెండేళ్ల క్రితమే పాతిపెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు ఆ ప్రాంతం నుంచి 114 ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో మొత్తం 32 శ్మశాన గుంటలు ఉన్నట్టు తెలిపారు. మెక్సికోలోని నేరస్తులు.. బాధితుల మృతదేహాలను దాచిపెట్టేందుకు ఇటువంటి రహస్య గుంటలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి గుంటలను గుర్తించి తవ్వేందుకు దర్యాప్తు అధికారులు గత నెలరోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పిట్స్‌‌ను కనుగొనేందుకు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు.
Sat, Sep 08, 2018, 10:10 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View