భూతంలా భయపెడుతున్న పెట్రో ధరలు.. రికార్డు స్థాయికి చేరుకున్న వైనం!
Advertisement
దేశ ప్రజలను పెట్రో ధరలు భూతంలా భయపెడుతున్నాయి. ప్రతి రోజూ పెరుగుతున్న ధరలు సామాన్యులను వణికిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేలా చేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే పెట్రోలు ధర లీటర్‌కు 48 పైసలు, డీజిల్‌పై 47 పైసలు పెరిగాయి. ధరలను రోజువారీగా సవరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.79.99కి చేరుకుని రికార్డు సృష్టించగా, డీజిల్ ధర లీటర్ రూ.72.07గా నమోదైంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.87.39గా ఉండగా, డీజిల్ రూ.76.51గా ఉంది. 16 ఆగస్టు నుంచి 31వ తేదీ మధ్య పెట్రోలు లీటర్‌కు రూ.2.85, డీజిల్‌ రూ3.30 పెరిగింది.

పెట్రో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా, పెట్రోలు ధర సెంచరీ కొట్టేలా ఉందని సామాన్యులు భయపడుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ పన్నులు తగ్గిస్తే ధరలు వాటంతట అవే తగ్గుతాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.  
Sat, Sep 08, 2018, 07:24 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View