రూ.200 అప్పు చేసి లాటరీ టికెట్ కొన్న కూలీ.. రూ.1.5 కోట్లు గెలుచుకున్న వైనం!
Advertisement
అదృష్టం ఏ వైపు నుంచి ఎలా వస్తుందో చెప్పడం కష్టం. అది తలుపు తడితే రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోతాయని చెప్పే సంఘటన ఇది. రూ.200 అప్పు చేసి లాటరీ టికెట్ కొన్న ఓ కూలీకి ఇదే జరిగింది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా మండ్వి గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ దినసరి కూలీ. ఇటీవల తెలిసిన వ్యక్తి వద్ద రూ.200 అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నాడు.

అప్పిచ్చిన వ్యక్తి పుణ్యమో, అతడి కష్టాలు కడతేరే సమయం వచ్చిందో కానీ అదృష్టం తన్నుకొచ్చింది. అతడు కొన్న లాటరీ టికెట్‌కు రూ.1.50 కోట్ల జాక్‌పాట్ తగిలింది. తనకు కోటిన్నర రూపాయలు వచ్చాయన్న సంగతిని మనోజ్ ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఇంత పెద్ద మొత్తం వస్తుందని, తన కల నెరవేరుతుందని అనుకోలేదని ఆనంద బాష్పాలు రాల్చాడు.

ఆగస్టు 29న రాఖీ బంపర్-2018లో రూ.1.50 కోట్లు గెలుచుకున్న తొలి ఇద్దరి విజేతలను పంజాబ్ స్టేట్ లాటరీ ప్రకటించింది. వారిలో ఒకరే మనోజ్ కుమార్. బుధవారం పంజాబ్ లాటరీ డైరెక్టర్‌ను  కలుసుకుని తన టికెట్‌ను సమర్పించాడు. వీలైనంత త్వరలోనే డబ్బులను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. లాటరీ సొమ్ముతో తన ఆర్థిక సమస్యలు ఎగిరిపోతాయని మనోజ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు.
Fri, Sep 07, 2018, 08:25 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View