కేసీఆర్‌ నిర్ణయంపై 'సాయన సిద్ధాంతుల' విశ్లేషణ ఇలా..!
Advertisement
గ్రహబలాన్ని నమ్మి ముందస్తుకు వెళ్తున్న కేసీఆర్‌కు కష్టాలు ఎదురుకానున్నాయా?.. అవుననే అంటున్నారు జ్యోతిష్యులు. కేసీఆర్ తన అదృష్ట సంఖ్య ప్రకారం..ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేశారు. దీనికి ముందు ఎంతో కసరత్తు జరిగింది. అయితే, ఈ ముహూర్తంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పునర్వసు, పుష్యమి నక్షత్రాలు సంధి నక్షత్రాలు కావని చెబుతున్నారు. దీనికి మూలం మహాభారతంలోనే ఉందని చెబుతూ.. అందుకు సంబంధించిన ఉదాహరణ కూడా చెబుతున్నారు.

పాండవులు అజ్ఞాతవాసం ముగించుకున్న తర్వాత కౌరవులతో సంధి కోసం పాండవుల తరపున శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరుతాడు. సరిగ్గా కార్తీక శుద్ధ ద్వాదశినాడు రేవతీ నక్షత్రం రోజున బయలుదేరిన కృష్ణుడు భరణి నక్షత్రం నాటికి చేరుకుంటాడు. ఆ తర్వాత ఏడు రోజులపాటు భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రులతో చర్చిస్తాడు. అయితే, చివరికి దుర్యోధనుడు సంధి ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. ఆ రోజు పుష్యమి నక్షత్రం.

ఎన్నికలకు వెళ్లడమంటే ప్రజలతో సంధి కోరడమేనని, కాబట్టి కేసీఆర్ పెట్టుకున్న ముహూర్తం వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని  సాయన సిద్ధాంతాన్ని అనుసరించే జ్యోతిష పండితులు చెబుతున్నారు. భవిష్యత్తులో కేసీఆర్‌కు చిక్కులు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే జ్యోతిష్యుల వాదన కూడా ఇలానే ఉంది. కేసీఆర్ వ్యక్తిగత జాతకం బాగానే ఉన్నా, గోచారాన్ని బట్టి మాత్రం ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఊహించని కష్టాలకు కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు.
Fri, Sep 07, 2018, 06:48 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View