టికెట్ అడిగితే ఎన్ని కోట్లు వున్నాయని అడుగుతున్నారు!: మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు!
Advertisement
ఆంధ్రప్రదేశ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం విశాఖపట్టణం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గురుపూజా మహోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమ పార్టీకి చెందిన ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గతంలో ఇంటింటికీ సెల్‌ఫోన్ పంచిపెట్టి ఓట్లు అడిగాడని, భార్యాభర్తలు ఇద్దరూ ఓటర్లయితే ఇద్దరికీ సెల్‌ఫోన్లు ఇచ్చాడని పేర్కొన్నారు. ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చుచేసి గెలిచిన వ్యక్తి ఆ తర్వాత అవినీతికి పాల్పడి ఆ సొమ్మును రాబట్టకపోతే అతడి భార్య కూడా నిలదీస్తుందని అన్నారు.

ప్రస్తుతం కొన్ని పార్టీల్లో విలువలు పాటించడం లేదని, డబ్బులుంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే స్థాయికి దిగజారాయని, విలువలకు గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాను 1983లో కాకినాడలో డిగ్రీ చేసి నర్సీపట్నం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చిందని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు ఫోన్‌లోనే చెప్పారని గుర్తు చేశారు. అప్పట్లో వ్యక్తులకు, విలువలకు అంత ప్రాధాన్యం ఉండేదన్నారు. ఏదైనా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తే తొలుత ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Thu, Sep 06, 2018, 06:09 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View