గన్ మెన్ తో ఫ్యాంట్ శుభ్రం చేయించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!
Advertisement
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర వివాదంలో చిక్కుకున్నారు. ఉల్సూర్ పర్యటన సందర్భంగా తన ఫ్యాంట్ పై బురద పడటంతో ఆయన గన్ మెన్ ను పిలిపించి శుభ్రం చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో మంత్రి వ్యవహారశైలిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న పరమేశ్వర నిన్న ఉల్సూర్ లోని ఎల్లమ్మ కోయిల్ వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఫ్యాంటుపై బురద పడటంతో స్థానిక నేత ఒకరు దాన్ని తుడిచేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆయన్ను వారించిన పరమేశ్వర, తన గన్ మెన్ ను పిలిపించి ఫ్యాంట్ ను తుడవమన్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న గన్ మెన్ కర్చీఫ్ తో డిప్యూటీ సీఎం ఫ్యాంటును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

కాగా డిప్యూటీ సీఎం వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘పరమేశ్వర.. సిగ్గుపడండి. ‘నేను మంత్రిని. నాకు అందరూ సేవలు చేయాలి’ వంటి మైండ్ సెట్ ఉన్నందుకు మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలి’’ అని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు. ఇప్పుడు పరమేశ్వరను ప్రజలు మంత్రిగా చూస్తున్నారనీ, ప్రవర్తనను మార్చుకోకపోతే త్వరలోనే కంత్రీగా గుర్తిస్తారని మరొకరు విమర్శించారు.
Wed, Sep 05, 2018, 02:29 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View