పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా బ్యాట్స్‌మన్.. టెస్టు సిరీస్ ఇంగ్లండ్ కైవసం!
Advertisement
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లో జరిగిన నాలుగో టెస్టును ఇంగ్లండ్ కైవసం చేసుకుని, సిరీస్‌ను 3-1తో దక్కించుకుంది. 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టపటపా వికెట్లు రాల్చుకుంది. ఫలితంగా 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఊరించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

4 పరుగుల వద్ద లోకేశ్ రాహుల్ (0) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో 13 పరుగులు జోడించాక తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (5) కూడా పెవిలియన్ చేరడంతో భారత్‌ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (58), అజింక్యా రహానే(51) అర్ధ సెంచరీలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. విలువైన భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ వారిద్దరూ ఔటయ్యాక మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

ఇంగ్లిష్ బౌలర్ల ముందు భారత బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. హార్దిక్ పాండ్యా (0), రిషబ్ పంత్ (18), రవిచంద్రన్ అశ్విన్ (25), ఇషాంత్ శర్మ (0), మహమ్మద్ షమీ (8), జస్ప్రిత్ బుమ్రా(0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరడంతో భారత్ ఇన్నింగ్స్ 184 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా 60 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్‌ను 1-3 తేడాతో ఇంగ్లండ్‌కు కోల్పోయింది. అంతకుముందు  ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేయగా, భారత్ 273 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసి భారత్ ఎదుట 245 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో భారత్ బోల్తా పడి సరీస్‌ను సమర్పించుకుంది.
Mon, Sep 03, 2018, 07:17 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View