పవన్ కల్యాణ్ ఫస్ట్ లవ్... డొక్కు కారు వేసుకెళితే, క్లాస్ పీకిన అందమైన అమ్మాయి!
Advertisement
తొలిప్రేమ... అది ఓ అలౌకిక భావన. ఈ విషయంలో ఒక్కొక్కరి అనుభవం ఒక్కోలా ఉంటుంది. ఓ అమ్మాయిని చూసి అబ్బాయి ఇష్టపడటం, అబ్బాయిని చూసి అమ్మాయి ఆరాధించడం, విషయం చెప్పలేక అవస్థలు పడటం ఎంతో మందికి అనుభవమే. ఇటువంటి అనుభవమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూ ఉంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న పవన్, తాను మద్రాసులో కంప్యూటర్ క్లాసులకు వెళ్లే రోజుల్లో జరిగిన అందమైన అనుభవాన్ని గుర్తు చేసుకుని, అభిమానులతో పంచుకున్నారు.

తనతో పాటు వచ్చే ఓ అందమైన అమ్మాయిని ఆయన ప్రేమించారట. ఆమె కూడా పవన్ తో చాలా సన్నిహితంగా ఉండేదట. కంప్యూటర్ క్లాసులు సాగుతున్న కొద్దీ ఇద్దరి మధ్య చనువు పెరిగిందట. తన ఫ్రెండ్స్ అందరూ ఇది స్నేహం కాదని, ప్రేమేనని చెబుతూ, త్వరగా మనసులోని మాటను చెప్పేయాలని పవన్ ను తొందర పెట్టారట. దీంతో ఓ మంచి ముహూర్తం చూసుకుని, ఇంట్లో ఎవ్వరూ వాడకుండా పక్కన పడేసిన డొక్కు కారు దుమ్ము దులిపి, దాన్ని వేసుకుని వెళ్లిన పవన్, ఆమెకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి, కారు ఎక్కించుకున్నారట.

మధ్యలో ఓ చోట కారు ఆపి, తన మనసులోని మాటను చెప్పేయగా, అంతా విన్న ఆ అమ్మాయి, ఈ వయసులో ప్రేమేంటి? అసలు ప్రేమంటే ఏమనుకుంటున్నావ్? అంటూ క్లాస్ పీకిందట. ఆ సమయంలో తను ఓ టీచర్ మాదిరిగా తన కంటికి కనిపించిందని తన తొలిప్రేమ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు పవన్ కల్యాణ్.
Sun, Sep 02, 2018, 06:50 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View