ఖతార్ కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న సౌదీ అరేబియా.. మొత్తం సరిహద్దునే తవ్వేసేందుకు యత్నం!
Advertisement
సౌదీ అరేబియా-ఖతార్.. దాదాపు ఏడాది క్రితం ఈ రెండు దేశాలది ఒకేమాట. కానీ అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ కు మద్దతు ఇవ్వడం, సౌదీ రాజ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఖతార్ జోక్యం చేసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. ఖతార్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందంటూ ఆరోపించిన సౌదీ అరేబియా, ఆ దేశానికి చెందిన ఖతార్ ఎయిర్ వేస్ విమానాలు తమ దేశంలో దిగకుండా నిషేధించింది. దీంతో యూఏఈ, ఈజిప్ట్, బహ్రెయిన్ సహా చాలా అరబ్ దేశాలు ఇదే బాట పట్టాయి. అయినా ఖతార్ లొంగకపోవడంతో ఈసారి సౌదీ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది.

సౌదీ-ఖతార్ లను కలుపుతున్న భూభాగం మధ్యలో కాలువను తవ్వేయాలని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా ఇప్పటివరకూ ఒక వైపున భూభాగంతో అనుసంధానమై ద్వీపకల్పంగా ఉన్న ఖతార్ ను ద్వీపంగా మార్చేసి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 రూ.53,152 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా 60 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో కాలువను తవ్వుతారు. ఈ కాలువలోనే అణు విద్యుత్ కేంద్రాల్లో మిగిలిపోయిన వ్యర్థాలను నిల్వ చేసేందుకు ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కాలువ నిర్మాణం కోసం ఐదు ప్రముఖ సంస్థలను బిడ్ వేయాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించింది. వీటి నుంచి ఒక నిర్మాణ సంస్థను వచ్చే నెలలో ఎంపిక చేసి ప్రకటిస్తారు.

గతంలో సౌదీ-ఖతార్ ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కువైట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఖతార్ పై విధించిన నిషేధం ఎత్తివేయాలంటే ఇరాన్ కు దూరంగా జరగడంతో పాటు ప్రముఖ అరబ్ మీడియా సంస్థ అల్ జజీరాను కూడా ముసేయాలని సౌదీ అప్పట్లో డిమాండ్ చేసింది. అంతేకాకుండా టర్కీలో ఉన్న సైనిక బేస్ ను మూసివేయాలని స్పష్టం చేసింది.
Sat, Sep 01, 2018, 04:04 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View