భారత్ టెలికాం చరిత్రలో అతిపెద్ద విలీనం.. కస్టమర్ల సంఖ్య 40 కోట్లకు పైమాటే!
Advertisement
భారత్ లో అతిపెద్ద టెలికాం కంపెనీగా ‘వొడాఫోన్-ఐడియా లిమిటెడ్’ అవతరించింది. ప్రముఖ టెలికాం సంస్థలు ఐడియా, వొడాఫోన్ లు విలీనం కావడంతో ఇది సాధ్యమైంది. ఈ విలీనం విషయాన్ని ఇరు కంపెనీలు ఈ రోజు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలకు సంయుక్తంగా 40.80 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

ఈ కొత్త కంపెనీ బోర్డులో 12 మంది డైరెక్టర్లకు చోటు కల్పించనుండగా వీరిలో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు ఉండనున్నారు. ఈ కొత్త కంపెనీకి కుమార మంగళం బిర్లా చైర్మన్ గా వ్యవహరిస్తారు. వోడాఫోన్ సీఈవోగా ఉన్న బాలేశ్ శర్మ కొత్త కంపెనీ సీఈవోగా కొనసాగుతారు.

ఇప్పటివరకూ భారత్ లో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎయిర్ టెల్ ఉండేది. తాజాగా ఆ స్థానాన్ని ‘వొడాఫోన్-ఐడియా లిమిటెడ్’ ఆక్రమించింది. పెరిగిపోతున్న పోటీకి తోడు జియో వంటి టెలికాం సంస్థలు రంగప్రవేశం చేయడంతో ఈ విలీనం అనివార్యమయిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ డీల్ కోసం రెండు కంపెనీలు ఏకకాల స్పెక్ట్రమ్ చార్జీల కింద రూ.3,900 కోట్ల నగదుతో పాటు మరో రూ.3,300 కోట్ల బ్యాంకు గ్యారెంటీలను టెలికాం శాఖకు సమర్పించాయి. తాజా విలీనం నేపథ్యంలో ఇరు కంపెనీల షేర్లు మార్కెట్ లో స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.
Fri, Aug 31, 2018, 03:24 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View