భారత టెక్కీలకు మళ్లీ షాకిచ్చిన అమెరికా.. హెచ్1బీ ప్రీమియం వీసా సస్పెన్షన్!
Advertisement
హెచ్1బీ వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారత  ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఇప్పటికే  హెచ్1బీ ప్రీమియం ప్రాసెసింగ్ విధానంపై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సాధారణంగా అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు హెచ్1బీ వీసాను జారీచేస్తారు. ఈ వీసా దరఖాస్తును పరిశీలించేందుకు 6 నెలలు పడుతుంది. కానీ ప్రీమియం ప్రాసెసింగ్ విధానం కింద రూ.86,181(1,225 అమెరికా డాలర్లు) చెల్లిస్తే కేవలం 15 రోజుల్లోనే హెచ్1బీ దరఖాస్తును పరిశీలిస్తారు. తాజాగా ఈ విధానంపై సస్పెన్షన్ ను అమెరికా 2019, ఫిబ్రవరి 19 వరకూ పొడిగించింది.

ప్రీమియం విధానం కారణంగా సాధారణ హెచ్1బీ వీసా దరఖాస్తులు భారీగా పెండింగ్ లో ఉండిపోతున్నాయని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్ సీఐఎస్) ఈ సందర్భంగా తెలిపింది. అందువల్లే ప్రీమియం దరఖాస్తులను మరో ఆరు నెలల పాటు నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో తొలుత ఆరు నెలల పాటు ప్రీమియం హెచ్1బీ దరఖాస్తులను నిలిపివేస్తూ యూఎస్ సీఐఎస్ నిర్ణయం తీసుకుంది. తాజాగా దాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ వీసాపై ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులు అమెరికాకు వెళుతుంటారు. తాజా నిర్ణయం నేపథ్యంలో భారత ఐటీ నిపుణులను కేవంల 15 రోజుల వ్యవధిలో అమెరికాకు తీసుకువెళ్లడం కుదరదు. దరఖాస్తు చేసిన 6 నెలల తర్వాతే అసలు వీసా మంజూరు అవుతుందా? లేదా? అన్నది తెలుస్తుంది.
Thu, Aug 30, 2018, 10:20 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View