ఈ తాత మామూలోడు కాదు.. 362 కేజీల నిమ్మకాయలు దొంగలించిన అమెరికన్!
Advertisement
ప్రపంచంలోని 64 కళల్లో చోరకళ ఒకటి. సాధారణంగా దొంగలు బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులు చోరీ చేస్తుంటారు. కానీ అమెరికాలోని ఓ పెద్దయన మాత్రం ఏకంగా నిమ్మకాయల తోటపై పడ్డాడు. చాలా కష్టపడి ఒక్కడే 362 కేజీల నిమ్మకాయలను కోశాడు. తీరా వాటిని రోడ్డుపైకి తీసుకునిరాగానే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన డియోంక్యో ఫియార్రస్(69) అనే పెద్ద మనిషి ఈ నిర్వాకాన్ని వెలగబెట్టాడు. తొలుత ఓ తోట నుంచి ఒక్కడే 362 కేజీల నిమ్మకాయలను తన ట్రక్కులో లోడ్ చేశాడు. ఓనర్ కంట పడకుండా జాగ్రత్తగా వాటిని తీసుకుని అక్కడినుంచి బయటపడ్డాడు. ఇక తప్పించుకున్నానులే.. అనుకుంటూ హాయిగా బయలుదేరాడు.

కానీ మార్గమధ్యంలో వాహనాలను ఆపి చెక్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఫియార్రస్ ట్రక్కును కూడా ఆపారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నిమ్మకాయలు తీసుకెళ్లేందుకు అనుమతులు ఉన్నాయా? వంటి ప్రశ్నలు అడిగారు. దీంతో తాను వీటిని దొంగతనం చేసి తీసుకువెళుతున్నట్లు అతను పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఈ తరహా దొంగతనాలు జరగడం కొత్తేం కాదు. ఈ ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోనే ఓ వ్యక్తి 4,000 కేజీల నారింజ పళ్లను దొంగతనంచేసి తీసుకువెళుతూ పోలీసులకు దొరికిపోయాడు.
Tue, Aug 28, 2018, 03:30 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View