ఆస్తులన్నీ పోతాయన్న భయంతో ఇండియాకు వచ్చేందుకు ఆత్రుతతో ఉన్న విజయ్ మాల్యా!
Advertisement
Advertisement
ఇండియాలో తనకున్న వందల కోట్ల విలువైన ఆస్తులు బ్యాంకుల పరమవుతాయన్న భయాందోళనలు వెంటాడుతుండడంతో, లండన్ లో తలదాచుకున్న విజయ్ మాల్యా సాధ్యమైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలన్న ఆత్రుతతో వున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాను ఇండియాకు వస్తానని సంకేతాలు ఇచ్చిన మాల్యా, రాజకీయ నాయకులు, అధికారులతో చర్చిస్తున్నట్టూ తెలుస్తోంది.

ఇటీవలి కాలం వరకూ ఇండియాలోని జైళ్లు సౌకర్యంగా ఉండవని, స్వచ్ఛమైన గాలి రాదని కుంటిసాకులు చెబుతూ తప్పించుకున్న ఆయన, కేంద్రం కొత్త చట్టం తెచ్చిన తరువాత మనసు మార్చుకున్నారు. ఎవరైనా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేస్తే, వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా 'ప్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్' చట్టాన్ని ఇటీవల కేంద్రం తీసుకువచ్చింది. ఒకసారి ఏదైనా ఆస్తిని సీజ్ చేస్తే, ఆపై దాన్ని తిరిగి విడుదల చేసే అవకాశం ఉండదు. ఈ నిబంధనతో భయపడుతున్న మాల్యా, ఇండియాకు వెళ్లి తన ఆస్తులను కాపాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఈ చట్టం కింద ఎవరి ఆస్తులనైనా సీజ్ చేస్తే, వాటి యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి వెళ్లిపోతాయని, ఆపై వాటిని విక్రయించి, బాధితులకు పరిహారం ఇవ్వడం మాత్రమే జరుగుతుందని ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తదితర సంస్థల పేరిట పలు బ్యాంకుల నుంచి రుణాలను పొందిన మాల్యా వాటిని తిరిగి చెల్లించడంలో విఫలం కాగా, ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ. 9,990 కోట్లను దాటింది. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రూ. 13,500 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది.
Tue, Aug 28, 2018, 10:57 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View