అగ్నిపర్వతం కారణంగా ఓడిపోయిన నెపోలియన్.. ఆసక్తికర విషయం చెప్పిన బ్రిటన్ పరిశోధకులు!
Advertisement
Advertisement
ఫ్రాన్స్ ను పాలించిన నెపోలియన్ బోనాపార్టీ తన కాలంలో మొత్తం యూరప్ ను గడగడలాడించాడు. బ్రిటన్ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇప్పటి నెదర్లాండ్స్ లోని వాటర్ లూలో 1815లో జరిగిన యుద్ధంలో నెపోలియన్ ను ఓడించడంతో చాలా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే నెపోలియన్ వాటర్ లూ యుద్ధంలో ఓడిపోవడానికి అగ్నిపర్వతం కారణమని తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ విషయమై బ్రిటన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు మాట్లాడుతూ.. 1815లో ఇండోనేషియాలోని తంబోర్ అగ్ని పర్వతం బద్దలయిందని తెలిపారు. దీని ప్రభావంతో భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో ధూళి, బూడిదతో కూడిన మేఘం కమ్ముకుందని వెల్లడించారు. దీని కారణంగా సూర్యరశ్మి భూమిని చేరలేదనీ, ఫలితంగా యూరప్ లో చాలాచోట్ల భారీ వర్షాలు కురిశాయని విశ్లేషించారు.

అగ్నిపర్వతం పేలిన కారణంగా ఇండోనేషియాలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. సూర్యరశ్మి చేరకపోవడంతో యూరప్ లో భారీ వర్షాలు కురవడం యుద్ధ రంగంలో నెపోలియన్ సైన్యానికి ప్రతికూలంగా మారిందని చెప్పారు. దీంతో బ్రిటన్ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు వాటర్ లూ యుద్ధంలో పైచేయి సాధించగలిగాయని తెలిపారు. ఈ పరిశోధన జియాలజీ అనే జర్నల్ లో ప్రచురితమైంది.
Tue, Aug 28, 2018, 10:08 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View