సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాక్ రైల్వే ఉద్యోగి లీవ్ లెటర్!
Advertisement
పాకిస్థాన్ రైల్వే అధికారి ఒకరు తన పై అధికారికి రాసిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడి లెటర్ చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. జియో న్యూస్ కథనం ప్రకారం.. హనీఫ్ గుల్ పాకిస్థాన్ రైల్వేలో గ్రేడ్ 20 అధికారి. పనిపై నిబద్ధత, ప్రేమ కలిగిన గుల్‌కు ఇటీవల ఓ చిక్కొచ్చి పడింది.

ఆగస్టు 20న రైల్వే మంత్రిగా షేక్ రషీద్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పనితీరు గుల్‌కు ఏమాత్రం నచ్చలేదు. వృత్తి పట్ల ఆయనకు ఏమాత్రం నిబద్ధత లేదని గుల్ ఆరోపణ. రైల్వే మంత్రిగా పనిచేయడానికి అవసరమైన అర్హతలు ఆయనకు ఏకోశానా లేవని గుల్ విమర్శించారు. మంత్రితో కలిసి తాను పనిచేయలేనని పేర్కొంటూ తనకు సెలవు మంజూరు చేయాలని కోరారు.

అయితే, సెలవు కోరడంలో వింతేమీ లేదు కానీ, తనకు ఏకంగా 730 రోజులు సెలవు కావాలని కోరడమే ఇక్కడ అసలు విషయం. అది కూడా పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని అందులో విన్నవించారు. రెండేళ్ల తర్వాత మంత్రి తీరు మారితే అప్పుడు విధుల్లో చేరే విషయాన్ని ఆలోచిస్తానని అందులో పేర్కొన్నారు. విషయం కాస్తా మీడియాకెక్కడంతో వైరల్ అయింది. ఆ లీవ్ లెటర్ సోషల్ మీడియాకు చేరడంతో చక్కర్లు కొడుతోంది. అతడి పనితీరుకు ఈ లేఖ నిదర్శనమని పేర్కొంటూ నెటిజన్లు గుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Tue, Aug 28, 2018, 09:54 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View