స్విట్జర్లాండ్ లో నీటి కొరతతో కరవు కరాళనృత్యం!
Advertisement
స్విట్జర్లాండ్ దేశం నీటి కొరతతో విలవిలలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంత నీటిఎద్దడితో అక్కడ కరవు కరాళనృత్యం చేస్తోంది. పంటభూములన్నీ బీళ్లుగా మారుతున్నాయి. పశుగ్రాసం కొరతతో మూగ జీవాలు అల్లాడుతున్నాయి. వందేళ్ళలో ఎన్నడూ లేనంత నీటి కరవు రావటంతో ప్రభుత్వం నీటివాడకంపై ఆంక్షలు పెట్టింది. నీటిని వృథా చేయకూడదని చెప్పిన ప్రభుత్వం అవసరానికి పరిమితంగా నీటి వినియోగం వుండాలని సూచించింది.

కార్ వాషింగ్ కు, స్విమ్మింగ్ పూల్స్ కు, గార్డెనింగ్ కు నీరు వృథా చేయద్దని హెచ్చరించింది. అయితే, నీటి లభ్యత ఎక్కువగా వున్న చోట కొంతమేర నిబంధనలను స్విస్ సర్కార్ సడలించింది. అలాగే నదులు, సరస్సుల్లో నీటి మట్టం పడిపోవటంతో విదేశీ పడవల రాకను పరిమితం చేసింది. ఇక పశువులను రక్షించేందుకు పశుగ్రాసం కోసం పడరాని పాట్లు పడుతోంది. కరవుతో గడ్డి దొరక్కపోవటంతో అక్కడి ఆర్మీ అధికారులు వెస్ట్ స్విట్జర్లాండ్ లోని కొండ ప్రాంతంలో ఉన్న గడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం హెలికాఫ్టర్ల ద్వారా నీటిని తరలించి వర్షంలా కురిపిస్తున్నారు. పెద్ద పెద్ద బ్యాగులతో నీటిని పోసి గడ్డి ఎండిపోకుండా కాపాడుతున్నారు. పశువుల ప్రాణాలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. 
Fri, Aug 24, 2018, 07:52 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View