ఉగ్రవాది అంటూ ఎన్నారైపై తప్పుడు కథనాలు.. రూ.8 కోట్లు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం!
Advertisement
ఎలాంటి ఆధారం లేకుండా మాఫియా ముఠా సభ్యుడిగా, అల్ కాయిదా ఉగ్రవాదిగా ముద్ర వేస్తే ఎలా ఉంటుంది? మాదకద్రవ్యాలు అక్రమంగా అమ్మేవాడిగా ముద్రవేసి పేపర్ లో కథనాలు రాసేస్తే.. బాధితుడి పరిస్థితి ఎలా వుంటుంది? కెనడాలోని భారత సంతతి వ్యాపారవేత్తపై ఓ వెబ్ సైట్ ఇలాంటి అసత్య కథనాలను ప్రచురించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం సదరు వెబ్ సైట్ కు భారీ జరిమానా విధించింది.

భారత సంతతి వ్యాపారవేత్త అల్తాఫ్ నజేరలిపై అమెరికాకు చెందిన డీప్ క్యాప్చర్.కామ్ అనే వెబ్ సైట్ తప్పుడు కథనాలను ప్రచురించింది. మార్క్ మిచెల్ అనే వ్యక్తి అల్తాఫ్ అల్ కాయిదా ఉగ్రసంస్థకు ధన సహాయం చేస్తున్నాడనీ, అతనికి ఇటాలియన్, రష్యన్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని సదరు వెబ్ సైట్ లో 2011లో కథనాలు రాశాడు. అంతేకాకుండా అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ ను అల్తాఫ్ అమ్ముతున్నాడని తప్పుడు ఆరోపణలు చేశాడు. ఈ కథనాలను క్రాస్ చెక్ చేసుకోకుండానే డీక్యాప్చర్.కామ్ వెబ్ సైబ్ ప్రచురించింది.

ఈ కథనాలతో తన పరువుకు నష్టం కలిగిందని అల్తాఫ్ కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన బ్రిటిష్ కొలంబియా కోర్టు.. ఈ తప్పుడు కథనాలను ప్రచురించినందుకు నష్ట పరిహారంగా అల్తాఫ్ కు రూ.8.4 కోట్లు చెల్లించాలని వెబ్ సైట్ ఓనర్ పాట్రిక్ బైర్న్ ను ఆదేశించింది. దీనిపై బైర్న్ కెనడా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ న్యాయస్థానం సైతం దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
Fri, Aug 24, 2018, 02:42 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View