మన ప్రేమ కోసం లక్షలు ఖర్చు చేశా.. తిరిగిచ్చెయ్.. ప్రేమికుల బెదిరింపులు!
Advertisement
Advertisement
యువతీయువకుల మధ్య ప్రేమ ఇప్పుడు కొంత పుంతలు తొక్కుతోంది. ‘ప్రేమ’ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సరదాగా తిరగడం, చనువుగా ఉండడం, ఫొటోలు తీసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే, ప్రేమగా ఉన్నప్పుడు ప్రతీదీ అందంగా, మధురంగా కనిపించేది కాస్తా తేడాలొచ్చేసరికి అందవిహీనంగా, చేదుగా మారిపోతోంది. ఇందుకు హైదరాబాద్‌లో జరిగిన రెండు ఘటనలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మొదటి ఘటన వివరాల్లోకి వెళ్తే..

నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. అక్కడే ఉన్నయువకుడితో ఏర్పడిన పరిచయం కొద్దికాలంలోనే ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి తిరిగారు. సినిమాలు, షికార్లకు వెళ్లారు. ఆ సందర్భంగా తమ ప్రేమకు గుర్తుగా బోల్డన్ని ఫొటోలు కూడా తీసుకున్నారు. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడసూపాయి. యువతి ప్రేమికుడిని దూరం పెట్టింది. అదే ఆమె చేసిన పాపం అయింది.

తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేని యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. నీ ప్రేమ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశానని, ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేయాలని బెదిరించాడు. లేదంటే ఇద్దరం కలిసి ఏకాంతంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు బజారుకీడుస్తానని హెచ్చరించారు. మొత్తం రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, వెంటనే ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.

ఇక రెండో ఘటనలోకి వస్తే.. కేపీహెచ్‌బీకే చెందిన ఓ వివాహిత భర్తతో కలిసి ముంబైలో ఉంటోంది. ఫేస్‌బుక్ చాటింగ్‌లో కొంతకాలం క్రితం నల్గొండకు చెందిన విద్యాసాగర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వివాహిత ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు విద్యాసాగర్ ఆమెను కలిశాడు. అయితే, స్నేహం శ్రుతి మించుతున్నట్టు గమనించిన వివాహిత అతడితో చాటింగ్‌కు గుడ్ బై చెప్పేసింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యాసాగర్ ఇటీవల ముంబై వెళ్లి ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు విద్యాసాగర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పంపించాడు.  

భర్తతో తనను కొట్టించడంతో వివాహితపై కక్ష పెంచుకున్న విద్యాసాగర్ బెదిరింపులకు దిగాడు. హైదరాబాద్‌లో కలుసుకున్నప్పుడు తీసిన ఫొటోలు తన వద్ద ఉన్నాయని, రూ.50 లక్షలు ఇవ్వకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో బాధితురాలు తన తండ్రికి చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు కేసులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Fri, Aug 24, 2018, 09:23 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View