కేంద్రానికి షాకిచ్చిన వాట్సాప్.. ప్రభుత్వం చెప్పినట్టు చేయలేమని చేతులెత్తేసిన వైనం!
Advertisement
మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రభుత్వానికి షాకిచ్చే ప్రకటన చేసింది. ఫేక్‌న్యూస్‌ను ఎవరు పుట్టిస్తున్నదీ తెలుసుకునే సాఫ్ట్‌వేర్ రూపొందించలేమని తేల్చి చెప్పింది. వాట్సాప్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని, ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తే దానికి విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. అది వాట్సాప్ స్వభావాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని పేర్కొంది. వాట్సాప్ దుర్వినియోగం అవుతుందన్న కారణంతో నిబంధనలను మార్చలేమని కుండబద్దలు గొట్టింది.

వాట్సాప్‌పై పూర్తి విశ్వాసంతో సున్నితమైన, అత్యంత రహస్యమైన విషయాలను కూడా అందులో పంచుకుంటున్నారని, ప్రభుత్వ ఆదేశాలతో వారి నమ్మకాన్ని వమ్ము చేయలేని పేర్కొంది. వైద్యులు, బ్యాంకులు, కుటుంబ సభ్యులు అత్యంత రహస్యమైన సంభాషణలకు దానిని వినియోగించుకుంటున్నారని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. అయితే, ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం షేర్ కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన వివరించారు.

వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ అవుతున్న తప్పుడు సమాచారం మూక హత్యలకు దారితీస్తుండడంతో వాట్సాప్ చర్చనీయాంశమైంది. దీనికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వాట్సాప్‌ను కోరింది. మూడు రోజల క్రితం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్స్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫేక్‌న్యూస్‌ తొలుత పుట్టిస్తున్న వారిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సిందిగా కోరారు. అలాగే,  ఫిర్యాదుల స్వీకరణకు ఓ అధికారిని కూడా నియమించాలని సూచించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Fri, Aug 24, 2018, 08:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View