సెమీస్ లోనే ఓటమి... వెనుదిరిగిన భారత్ పురుషుల కబడ్డీ జట్టు!
Advertisement
ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయారు. ఫేవరేట్ గా బరిలోకి దిగిన ఇండియాను ఇరాన్ 10 పాయింట్ల తేడాతో ఓడించింది. ఇరాన్ జట్టు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఫైనల్స్ కి వెళ్లింది.

కచ్చితంగా ఫైనల్స్ లో మెడల్ సాధిస్తారని ఎంతో ఊహించిన ఫేవరెట్‌ ఆటగాళ్లు పర్దీప్‌ నర్వాల్‌, మోనూ గోయత్‌ విఫలమయ్యారు. ఇరాన్ కంటే ముందు జరిగిన గ్రూప్ -బి పోరులో కూడా టీమిండియా కొరియా చేతిలో ఒక్క పాయింట్ తేడాతో ఓటమిపాలయ్యింది. సెమీస్ లోకి ప్రవేశించిన భారత్ పురుషుల కబడ్డీ జట్టు తొలుత తమ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇరాన్ పై తొలి రౌండ్లో 5-1తో ఆధిక్యంతో నిలిచారు.

అయితే, డిఫెండింగ్ టెక్నిక్స్ తో ఇరాన్ ఆ స్కోరును 8-8 గా సమానం చేసింది. ఆ తర్వాత భారత ఆటగాళ్ళు 11-9తో ఒకడుగు ముందుకు వేస్తే ఇరాన్ ఆటగాళ్ళు 14-11తో ఆధిక్యంతో వరుసగా మూడు పాయింట్లు దక్కించుకున్నారు. ఇక అక్కడ నుండి విజృంభించిన ఇరాన్ ఆటగాళ్ళు 16-12, 20-14 తో సాగి, చివరకు 27-17తో ఆలౌట్‌ చేసి విజయం సాధించారు. దీంతో భారత్ పురుషుల కబడ్డీ జట్టు నిరాశతో వెనుదిరిగింది. 
Thu, Aug 23, 2018, 09:15 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View