ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్!
Advertisement
ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా షూటర్ గా రహీ జీవన్ సర్నోబత్ రికార్డు సృష్టించింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణ పతకం దక్కింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ జీవన్ బంగారు పతకం సాధించింది. ఫైనల్లో రహీ జీవన్, యంగ్ పైబూన్ హోరాహోరీగా తలపడ్డారు. స్టేజ్-1లో మూడు రౌండ్లలో జీవన్ 15 పాయింట్లకు గాను 14 సాధించింది. స్టేజ్-2లో జరిగిన 7 రౌండ్లలో 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

స్టేజ్-1లో వెనుకబడిన యంగ్ పైబూన్ స్టేజ్-2లో పుంజుకుంది. రహీ జీవన్, యంగ్ పైబూన్ లిద్దరూ చెరో 34 పాయింట్లు సాధించారు. తొలి షూటాప్ లో ఇద్దరూ 4-4తో సమానంగా నిలిచారు. రెండో షూటాప్ లో రహీ జీవన్ 3 పాయింట్లు సాధించగా, యంగ్ పైబూన్ కేవలం 2 పాయింట్లు మాత్రం సంపాదించింది. దీంతో, రహీ జీవన్ కు స్వర్ణ పతకం దక్కింది. కాగా, థాయ్ లాండ్ ప్లేయర్  యంగ్ పైబూన్ రజత పతకం, కొరియాకు చెందిన మిని జంగ్ కాంస్య పతకం దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా, ఆసియా క్రీడల్లో భారత్ కు ఇది నాలుగవ పసిడి పతకం కాగా, షూటింగ్ లో రెండోది. ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ మొత్తం 11 పతకాలు సాధించింది.
Wed, Aug 22, 2018, 03:23 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View