పరిశుభ్రత విషయంలో స్మార్ట్ ఫోన్ డెడ్ 'చీప్'... తాజా అధ్యయనంలో వెల్లడి!
Advertisement
పొద్దున లేస్తే ప్రతి ఒక్కరి చేతిలో వుండే వస్తువు స్మార్ట్ ఫోన్.. మన జీవితంలో మనుషులకంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న వస్తువు అది. అలాంటి వస్తువు అత్యంత మురికిగా, టాయిలెట్ ల కంటే డర్టీ గా ఉంటోందట. అది చాలా డేంజర్ అని పరిశోధకులు చెబుతున్నారు. అవునా... అని నోరెళ్ళబెట్టకండి. మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ మీద మల విసర్జనకు కూర్చునే టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ సూక్ష్మ క్రిములు ఉంటాయట!
 
తెల్లారిలేస్తే అన్నీ శుభ్రం చేసుకునే మనం ప్రతీక్షణం వాడుతున్న స్మార్ట్ ఫోన్ లను మాత్రం శుభ్రం చేసుకోము.. అందుకే అవి టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువ సూక్ష్మ క్రిములతో నిండిపోయి చర్మ వ్యాధులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
స్మార్ట్ ఫోన్ల మీద పరిశోధన చేసిన వారు చెప్పిన మరిన్ని వివరాలు... స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించే వారిలో 35 శాతం మంది అసలు దాన్ని శుభ్రం చెయ్యరు. 20మంది స్మార్ట్ ఫోన్ యూజర్లలో ఒక్కరే 6 నెలలకోసారి మొబైల్ స్క్రీన్ ను శుభ్రం చేస్తారట. ఎవరైతే శుభ్రం చెయ్యరో ఆ ఫోన్ స్క్రీన్స్ మీద టాయిలెట్ సీట్ కంటే మూడురెట్లు అధికంగా సూక్ష్మక్రిములు ఉంటాయట.

ఈ సూక్ష్మక్రిములను ఆ వస్తువుల వైశాల్యాన్ని బట్టి కొలిస్తే టాయిలెట్ సీట్, ఫ్లష్ మీద 24 యూనిట్లు వుంటే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద 84.9 యూనిట్లు అంటే మూడు రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఏరోబిక్ బ్యాక్టీరియా, ఈస్ట్, మౌల్డ్ అనే మూడు రకాల సూక్ష్మక్రిములు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై ఉండే హానికరమైన బ్యాక్టీరియా అని పరిశోధకులు చెబుతున్నారు.

  యూకేలో 5 శాతం మంది యువకులు ఒకవారంలో ఆఫీసులో పనిచేసినదాని కంటే స్మార్ట్ ఫోన్ మీదనే ఎక్కువ గడుపుతున్నారని, నిద్రలేవగానే ఫోన్ చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది. గతంలో పడుకునే ముందు మొబైల్ చూసేవారు 37 శాతంమంది వుంటే, ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని చెప్పారు. పైగా, ఈ స్మార్ట్ ఫోన్ లలో గడిపేవాళ్ళంతా 35 ఏళ్ళలోపువారే అని తెలిపారు. మన టాయిలెట్ ల కంటే దరిద్రంగా వుండే స్మార్ట్ ఫోన్ లను శుభ్రం చేసుకోకుండా వాడితే, మరి మనకే కదా ప్రమాదం. ఇప్పుడీ విషయం తెలిశాకైనా స్మార్ట్ ఫోన్ ను వాడడమే కాదు, దానిని శుభ్రం కూడా చేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకుంటే మనకే మంచిది!  
Tue, Aug 21, 2018, 09:53 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View