అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల మెరుపుదాడి.. 100 మంది కిడ్నాప్!
Advertisement
అఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు ఈ రోజు రెచ్చిపోయారు. తఖర్ ప్రావిన్సు నుంచి రాజధాని కాబూల్ కు వెళుతున్న మూడు బస్సులపై మెరుపుదాడి చేశారు. అనంతరం వాటిలోని ప్రయాణికులు, భద్రతా సిబ్బంది 100 మంది కిడ్నాప్ చేశారు.

ఈ విషయాన్ని అఫ్గన్ ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. కుందుజ్ ప్రావిన్సులో మూడు బస్సుల్లోని ప్రయాణికులను కిడ్నాప్ చేసిన తాలిబన్లు.. వారిని గుర్తుతెలియని రహస్య ప్రాంతానికి తరలించారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కిడ్నాపైన వారిలో ప్రజలతో పాటు అఫ్గన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కిడ్నాప్ అయిన ప్రజల కోసం గాలింపు ప్రారంభించినట్లు వెల్లడించారు.

మరోవైపు ఈ కిడ్నాప్ కు పాల్పడింది తామేనని తాలిబన్ సంస్థ ప్రకటించింది. వీరిలో అమాయకులైన ప్రజలను తాము వదలివేస్తామని తెలిపింది. భద్రతా సిబ్బందిని మాత్రం తమ చెరలోనే ఉంచుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాలిబన్ సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనను విడుదల చేశారు.

బక్రీద్ పర్వదినం సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని ఇటీవల అఫ్గన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాలిబన్లను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకూ స్పందించని తాలిబన్లు బక్రీద్ కు రెండ్రోజుల ముందు ఏకంగా 100 మందిని కిడ్నాప్ చేశారు.
Mon, Aug 20, 2018, 02:09 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View