అటు చైనా, ఇటు తైవాన్.. మధ్యలో ‘పలావు’గా మారిపోతున్న పసిఫిక్ ద్వీపం!
Advertisement
అందితే జుట్టు, అందకుంటే కాళ్లు.. ఇదే జగడాల మారి చైనా శైలి. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చెబుతున్న చైనా పొరుగున ఉన్న చాలా దేశాలతో ఇదే తరహాలో గొడవలు పెట్టుకుంటోంది. అసలు తైవాన్ మొత్తం తమదేనని వాదిస్తున్న డ్రాగన్ దేశం తాజాగా ఓ చిన్న పసిఫిక్ దేశంపై పగపట్టింది.


గట్టిగా 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పాతిక వేల జనాభా కూడా లేని పసిఫిక్ ద్వీపం పలావుపై చైనా కోపం తెచ్చుకుంది. పలు అంశాలపై తైవాన్ కు పలావు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి తమ పౌరులు వెళ్లకూడదని ఆర్డర్ జారీచేసింది. పలావు అక్రమ ప్రాంతమని, అక్కడ పర్యటించేందుకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఎంత ఒత్తిడి చేసినా తనవైపు రాకపోవడంతో జిన్ పింగ్ ప్రభుత్వం పలావుపై కొరడా ఝుళిలిపించింది.


పలావు ద్వీపం ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోంది. ఈ దేశానికి వచ్చే టూరిస్టుల్లో సగం మంది చైనా వాసులే. అంతర్జాతీయ వేదికలపై తైవాన్ తరఫున పలావు నిలబడటంతోనే డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పలావులోని హోటళ్లు, రిసార్టులు, సముద్ర తీరాలు జనాలు లేక వెలవెలబోతున్నాయి. కాగా పలావుపై పర్యాటకాన్ని చైనా ఆయుధంగా వాడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


గతేడాది పలావును 1.22 లక్షల మంది విదేశీయులు సందర్శించగా, వీరిలో 55 వేల మంది చైనీయులే ఉన్నారు. గతేడాది దక్షిణ కొరియా అమెరికా థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థలను మోహరించడంతో ఆ దేశంపై కూడా చైనా ఇదే తరహాలో నిషేధం ప్రకటించింది. వన్ చైనా విధానంలో భాగంగా తైవాన్ భూభాగం మొత్తం తమదేనని డ్రాగన్ దేశం వాదిస్తున్న సంగతి తెలిసిందే. తమతో సంబంధాలు కావాలనుకుంటే ఈ విధానాన్ని అంగీకరించాలని ప్రపంచదేశాలకు హుకుం జారీచేస్తోంది.
Mon, Aug 20, 2018, 12:26 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View