కేరళకు రూ.12 కోట్ల సాయం ప్రకటించిన యూఏఈలోని భారత సంతతి వ్యాపారవేత్తలు!
Advertisement
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని భారత సంతతికి చెందిన బిలియనీర్ వ్యాపారవేత్తలు కేరళ వరదలకు చలించిపోయారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తమవంతు సాయంగా సుమారు 12 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి మంచి మనసును చాటుకున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతంగా కేరళను వరదలు ముంచెత్తాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. నగరాలు, పట్టణాలు నదులను తలపిస్తున్నాయి. బాధితులు బిక్కుబిక్కుమంటూ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరద తాకిడికి చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు విదేశాలూ ముందుకొస్తున్నాయి.

తాజాగా యూఏఈలోని బడా వ్యాపారవేత్తలు ఆర్థిక సాయం ప్రకటించారు. కేరళలో పుట్టి యూఏఈలో లాలు గ్రూప్ పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన యూసుఫ్ ఎంఏ 10 మిలియన్ దీనార్లు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఫాతిమా హెల్త్‌కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ 50 మిలియన్ దీనార్లు ప్రకటించారు. ఇందులో 10 మిలియన్లు ముఖ్యమంత్రి సహాయనిధికి నేరుగా వెళ్లనుండగా మిగతా సొమ్మును వైద్య సహాయం కోసం వినియోగించనున్నట్టు చెప్పారు.

యూనిమోని అండ్ యూఏఈ ఎక్స్చేంజ్ చైర్మన్ బీఆర్ షెట్టి 20 మిలియన్ దీనార్లు, భారతీయ వైద్యుడు, ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆజాద్ మూపెన్ 5 మిలియన్ దీనార్లు విరాళంగా ప్రకటించారు. అలాగే, 300 మంది వలంటీర్లను సహాయక చర్యల కోసం పంపిస్తున్నట్టు తెలిపారు.
Mon, Aug 20, 2018, 10:30 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View