వాజ్ పేయి మరణంపై విదేశీ మీడియా కవరేజ్.. నివాళులు!
Advertisement
భారతరత్న, మాజీ ప్రధాని వాజ్ పేయి మరణ వార్తను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. పలు దేశాల పత్రికలు, వాజ్ పేయి మృతి వార్తను ప్రచురిస్తూ, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాయి. ఆయన పాదరసం వంటి మృదు స్వభావని, ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో జవహర్ లాల్ నెహ్రూకు ఆయన బలమైన ప్రత్యర్థని 'బీబీసీ' పేర్కొంది. వాజ్ పేయికి నివాళులు అర్పిస్తూ, 'ది గార్డియన్' పత్రిక, హిందూ జాతీయ వాద ఉద్యమం కఠినంగా కనిపించినా, అందులోని నేత వాజ్ పేయి మితవాదని, రాజకీయ వైరుద్ధ్యాన్ని చూపుతారని పేర్కొంది. పోఖ్రాన్ లో అణు పరీక్షలు చేసి పాక్ వెన్నులో వణుకు పుట్టించారని, ఆ దేశంతో శాంతిని కోరుతూ, తొలి అడుగులు వేశారని కొనియాడింది.

అమెరికన్ పత్రిక 'ద న్యూయార్క్ టైమ్స్' వాజ్ పేయి మరణ వార్తను ప్రచురిస్తూ, అణు పరీక్షలను ప్రస్తావించింది. పోఖ్రాన్ ఉదంతంతో ప్రపంచమే నివ్వెరపోయేలా వాజ్ పేయి చేశారని తెలిపింది. ఇండియా వంటి అత్యధిక జనాభాగల దేశంలో ప్రజలందరికీ ఆయన ఓ తాతయ్య వంటి వారని, అన్ని మతాల వారికీ సమాన హక్కులను కల్పించారని పేర్కొంది. "ఇండియాను అణ్వాయుధ శక్తిగా మార్చిన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 93 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు" అని 'ద వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. పాక్ లోని ప్రముఖ పత్రిక 'డాన్' కూడా వాజ్ పేయిని ప్రశంసిస్తూ కథనాలు రాసింది. పాకిస్థాన్ తో శాంతి ప్రక్రియను ఆయనే ప్రారంభించారని గుర్తు చేస్తూ, ఇండియన్ పాలిటిక్స్ లో ఆయన ఓ అరుదైన వ్యక్తని, మచ్చలేని నేతని కొనియాడింది.
Fri, Aug 17, 2018, 12:17 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View