13 నెలల గరిష్ఠానికి డాలర్... 18 నెలల కనిష్ఠానికి బంగారం!
Advertisement
టర్కీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా లీరా కరెన్సీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో అమెరికన్ డాలర్ కు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ ఇన్వెస్టర్లు డాలర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తుండటంతో 13 నెలల గరిష్ఠానికి డాలర్ చేరుకుంది. ఈ ప్రభావం అటు ముడి చమురు మార్కెట్ పైనా, ఇటు బులియన్, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పైనా ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.8 శాతం పడిపోయి బ్యారల్ కు 70.66 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ ముడి చమురు ధర 2.1 శాతం పడిపోయి 64.85 డాలర్లకు చేరింది.

మరోవైపు బులియన్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఫారెక్స్ మార్కెట్ వైపు మళ్లించేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నిస్తుండటంతో, బంగారం ధరలు 18 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ఔన్సు బంగారం ధర 1,184 డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి 2017 తరువాత బంగారం ధర ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి.

మరోవైపు బుధవారం నాటి అమెరికా, యూరప్ మార్కెట్లు భారీ పతనం, ఆపై నేటి ఆసియా మార్కెట్ల తీవ్ర ఒడిదుడుకుల మధ్య భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచిక బీఎస్ఈ ప్రారంభంలోనే 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ ఉదయం 9.20 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 130 పాయింట్లు తక్కువగా 37,721 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Thu, Aug 16, 2018, 09:22 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View