స్టాక్ వదిలించుకునేందుకు... హోండా సీఆర్-వీ పై ఏకంగా లక్షన్నర డిస్కౌంట్!
Advertisement
దాదాపు దశాబ్దకాలంగా ప్రపంచ కార్ల మార్కెట్ లో మంచి విక్రయాలను నమోదు చేసిన హోండా సీఆర్-వీ అమ్మకాలను నిలిపివేయాలని భావిస్తూ, నిల్వ ఉన్న స్టాక్ ను వదిలించుకునేందుకు భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. వచ్చే అక్టోబర్ లో సరికొత్త సీఆర్-వీ వర్షన్ ను మార్కెట్లోకి తేవాలని భావిస్తున్న సంస్థ, ఇప్పుడున్న స్టాక్ పై ఏకంగా రూ. 1.50 లక్షల డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇదే సమయంలో పెట్రోల్ మోడల్ పై రూ. 50 వేల అదనపు డిస్కౌంట్ ను డీలర్లు ఆఫర్ చేయనున్నారని తెలిపింది.

ప్రస్తుతం హోండా సీఆర్-వీ ధర రూ. 22.89 లక్షలు (2.0 లీటర్ ఆటోమేటిక్ - పెట్రోల్), రూ. 25.18 లక్షలు (2.4 లీటర్ ఆటోమేటిక్ - పెట్రోల్)గా ఉన్న సంగతి తెలిసిందే. స్టాక్స్ ముగిసేంత వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హ్యుందాయ్ టస్కాన్, రెక్స్ టన్ తదితర కార్లకు సీఆర్-వీ పోటీగా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఇదే ధరతో 7 సీట్లతో కూడిన టయోటా ఫోర్చ్యూనర్,ఫోర్డ్ ఎండీవర్, స్కోడా కోడియాక్ వంటి ఎస్యూవీల రాకతో సీఆర్-వీ అమ్మకాలు గణనీయంగా తగ్గగా, ఈ మోడల్ ను మరింత ఆధునికీకరించాలని హోండా నిర్ణయించింది.
Tue, Aug 14, 2018, 11:58 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View