సచిన్ నిద్రలో నడుస్తాడు.. బయటపెట్టేసిన గంగూలీ!
Advertisement
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు నిద్రలో నడిచే అలవాటు ఉందంటున్నాడు టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ. ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించాడు. నిజానికి సచిన్, గంగూలీ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులే. ఆ తర్వాత వీరిద్దరూ భారత జట్టుకు ఓపెనర్లుగా మారి ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

తాజాగా ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’ కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ సచిన్ క్రికెట్ కెరియర్ మొత్తం తనకు తెలుసన్నాడు. కాబట్టి సచిన్‌ను చాలా దగ్గరి నుంచి చూసే అవకాశం తనకు లభించిందన్నాడు. కొన్నిసార్లు సచిన్ తనను కోపగించుకునేవాడని గుర్తు చేసుకున్నాడు.  

సచిన్, వినోద్ కాంబ్లీలు తనపై చేసిన ఓ చిలిపి పని గురించి ప్రస్తావించాడు. ‘‘అప్పుడు నేను ఇండోర్ స్టేడియంలో జాతీయ క్యాంపులో ఉన్నాను. అది ఆదివారం. ఆ రోజు వాసు సర్ నన్ను చాలా ఎక్కువ సేపు పరిగెత్తించారు. దీంతో ఆ మధ్యాహ్నం నన్ను వదిలేశారు. దీంతో నేను, నా రూమ్మేట్ మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం నిద్రలేచాం. మేం నిద్ర లేచేసరికి రూము నిండా నీళ్లున్నాయి. సూట్‌కేసులు నీళ్లలో తేలుతున్నాయి.

బాత్‌రూములో పైపు పగిలిపోయి ఉంటుందని భావించి అక్కడికి వెళ్లా. అక్కడ చుక్కనీరు కూడా లేదు. దీంతో తలుపు తీసి చూశా. ఎదురుగా సచిన్, కాంబ్లీ బకెట్లతో నీళ్లు పట్టుకుని ఉన్నారు’’ అని వివరించాడు. ‘నేను వారిని ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించా. దానికి వారు ‘మధ్యాహ్నం పూట నిద్రపోతావా? అని అడిగారు. ఏం? అదేమైనా నేరమా? అని ఎదురు ప్రశ్నించా. దానికి వారు.. మేం టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడాలనుకుంటున్నామని చెప్పారు. అలా అయితే నన్ను తట్టి లేపవచ్చు కదా? ఇదేం పని? అని నిలదీశా’’ అని గుర్తు చేసుకున్నాడు.

ఓసారి ఇంగ్లండ్ టూర్‌లో ఉన్నప్పుడు సచిన్ తనను భయపెట్టాడని చెప్పాడు. అతడికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉండేదని, తొలినాళ్లలో అది చూసి భయపడేవాడినని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఇంగ్లండ్ టూర్‌లో ఉన్నప్పుడు నేను, సచిన్ రూమ్మేట్స్. ఓ రోజు తను నిద్రలో నడుస్తుంటే చూశా. బాత్రూముకు వెళ్తున్నాడనుకున్నా. కానీ ప్రతీరోజూ అలానే లేచి నడిచేవాడు. అసలతడేం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఓరోజు మెలకువతో ఉన్నా. రాత్రి 1:30 గంటల సమయంలో నిద్రలేచాడు. రూమంతా తిరిగాడు.  కుర్చీలో కూర్చున్నాడు. తర్వాత నా పక్కకి వచ్చి నిద్రపోయాడు’’  అని వివరించాడు.

దీంతో ఆ మరుసటి రోజు సచిన్ దగ్గరికి వెళ్లి రాత్రుళ్లు నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? అని అడిగానని, దానికి అతడు.. లేదు, తనకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని చెప్పాడని గంగూలీ చెబుతూ నవ్వేశాడు. 
Mon, Aug 06, 2018, 01:33 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View