ద్రవాహారంతో బరువు తగ్గొచ్చా? డైట్ నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Advertisement
బరువు తగ్గేందుకు జనాలు చాలా చిట్కాలు పాటిస్తుంటారు. కొందరు ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో తేనెను కలిపి తీసుకుంటే మరికొందరమో వైద్యుల్ని సంప్రదించి అల్లోపతి మందులు వాడతారు. ఇంకొందరు మాత్రం అస్సలు అన్నం తినడం మానేసి కేవలం పండ్ల రసాలు తాగి కాలం గడిపేస్తుంటారు. అయితే కేవలం జ్యూస్ వంటి ద్రవరూప ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చా? అన్న ప్రశ్నకు డైటీషియన్లు కాదనే సమాధానమిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
 ఘన ఆహారం తినాల్సిందే

మనం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చురుగ్గా పనిచేయడానికి కావాల్సిన బలం ఘన ఆహారం వల్లే లభిస్తుందన్నది నిపుణులు చెప్పేమాట. ఒకవేళ ఎవరైనా కేవలం జ్యూస్ లు, ఇతర ద్రవాహారం తీసుకుంటే వారి శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీంతో సాయంత్రానికంతా విపరీతంగా అలసిపోతారు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

 ఆరోగ్యానికి పెనుముప్పు

అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, కార్పొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ పళ్ల రసాల్లో లభించవు. దీనివల్ల శరీరంలో రక్తపోటు(బీపీ)తో పాటు షుగర్ స్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల జ్యూస్ లు తాగేవారికి డయేరియాతో పాటు మలబద్ధకం వచ్చే అవకాశం ఉందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.
 వ్యక్తిగత జీవితంపై దుష్ప్రభావం

కేవలం ఆరోగ్యమే కాదు.. వ్యక్తిగత, వృత్తి జీవితం కూడా దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఎందుకంటే ద్రవాహారం తీసుకున్నవారిలో శరీరానికి తగిన శక్తి లభించక అలసట వచ్చేస్తుంది. దీంతో ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం, ప్రతి చిన్నవిషయానికి కోపంతో గట్టిగా అరవడం ప్రారంభిస్తారు. తద్వారా ఆఫీసులో బాస్, తోటి ఉద్యోగులతో, ఇంట్లో కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయి.
 రోజుకు 2,500 కేలరీలు తీసుకోవాలి

ఈ ద్రవరూప ఆహారంలో తగినన్ని కేలరీలు ఉండవని డైట్ నిపుణులు చెబుతున్నారు. మానవ శరీరానికి రోజుకు సగటున 2,500 కేలరీల శక్తి అవసరం. అయితే ఈ జ్యూస్ ల ద్వారా కేవలం 800 నుంచి 1200 కేలరీలు మాత్రమే అందుతాయి. చివరికి శరీరంలో జీవక్రియ నెమ్మదించడం ద్వారా నిస్తేజంగా మారిపోతారు.

 సమతుల ఆహారం..సరైన వ్యాయామం

జ్యూస్ ల ద్వారా బరువు తగ్గుతారనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డైటీషియన్లు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పీచు పదార్థాలు సమపాళ్లలో తింటూ తగిన వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. పైగా ఈ విధానంలో ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని హామీ ఇస్తున్నారు.
Thu, Aug 02, 2018, 01:06 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View