నాలుగు గంటల ఆపరేషన్.. బాలిక గొంతులోంచి 9 సూదుల వెలికితీత.. సూదుల వెనక మూఢనమ్మకాలు?
Advertisement
14 ఏళ్ల బాలికకు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి ఆమె గొంతులోంచి 9 సూదులను వెలికి తీశారు. కోల్‌కతాలో జరిగిందీ ఘటన. కృష్ణా నగర్‌కు చెందిన బాలికను కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె గొంతులో ఇరుక్కున్న సూదులను వైద్యులు నాలుగు గంటల పాటు శ్రమించి వెలికి తీశారు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి బాలికను రక్షించిన వైద్యులు సూదులు గొంతులోకి ఎలా వెళ్లాయన్న విషయాన్ని వెల్లడించలేదు. అయితే, వాటిని ఆమె మింగలేదని, బయటి నుంచే అవి లోపలికి వెళ్లాయని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.

ఈఎన్‌టీ వైద్యుడు మనోజ్ ముఖర్జీ మాట్లాడుతూ బాలిక మెడలోని కండరాల్లోకి సూదులు చొచ్చుకుపోయినట్టు చెప్పారు. అయితే, ఆహార నాళంలోకి అవి ప్రవేశించలేదని పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రులు మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తనకు గొంతులో నొప్పిగా ఉందని బాధిత బాలిక గత నెల 29న తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఓ సూది గొంతు వెనక, మరో 8 సూదులు ఆహార నాళానికి సమీపంలో ఉన్నట్టు గుర్తించారు.

కాగా, బాలిక గొంతులోకి సూదులు వెళ్లడం వెనక సోది చెప్పేవారి (జ్యోతిష్యులు) హస్తం ఉండొచ్చని బాలిక ఇంటి ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. బాలిక పెద్ద సోదరుడు మూడేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆమె కూడా చనిపోవడంతో బాలిక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను తిరిగి మామూలు మనిషిని చేసేందుకు తల్లిదండ్రులు సోది చెప్పే వారి వద్దకు తీసుకెళ్లి ఉంటారని, వారే సూదులను ఆమె గొంతులో గుచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు.
Thu, Aug 02, 2018, 08:26 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View