ఐదుగురు గాళ్ ఫ్రెండ్స్‌ను సంతోష పెట్టేందుకు దొంగగా మారిన 63 ఏళ్ల వృద్ధుడు!
Advertisement
వయసు శరీరానికే కానీ మనసుకు కాదనుకున్నాడో ఏమో ఈ 63 ఏళ్ల వృద్ధుడు. ఏకంగా ఐదుగురు గాళ్‌ ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేస్తూ వారిని సంతోష పెట్టేందుకు దొంగగా మారాడు. జుట్టుకు రోజూ రంగేసుకుంటూ రాయల్ లైఫ్ అనుభవిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చేవాడు. గాళ్ ఫ్రెండ్స్‌ను సంతోషపెట్టేందుకు వారి వద్ద తన రిచ్‌నెస్‌ను ప్రదర్శించేవాడు. విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేవాడు. అయితే, అయ్యగారి బాగోతం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయి బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ 63 ఏళ్ల ‘నవ యువకుడు’ కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) నుపుర్ ప్రసాద్ కథనం ప్రకారం.. నిందితుడు బంధురామ్.. ఆనంద్ పర్‌బాత్ ప్రాంతంలోని ఓ స్లమ్ ఏరియా నివాసి. అవివాహితుడు. చాలా ఏళ్ల క్రితమే కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన బంధురామ్ మంగోల్‌పురికి మకాం మార్చాడు. ఈ క్రమంలో అతడికి 28 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిని సంతోషపరిచేందుకు ఖరీదైన బహుమానాలు ఇచ్చేవాడు. ఇందుకోసం దొంగతనాలు చేసేవాడు. దొంగతనం చేసిన సొత్తును విక్రయించి వచ్చిన దానిని కొంత బహుమానాల కోసం ఉపయోగించగా మిగతా దాంతో దర్జాగా బతికేవాడు.

తాజాగా ఉత్తర ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో ఖరీదైన వస్తువులను దొంగతనం చేస్తూ సీసీ కెమెరాల కంటికి చిక్కాడు. ఉదయం ఫ్యాక్టరీ తెరిచిన ఉద్యోగులు రెండు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ, రూ.60 వేల నగదు మాయమైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా దొంగ గారి బాగోతం బయటపడింది. రామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దొంగిలించిన వస్తువులతోపాటు రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రామ్ గత 20 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడని, పలుమార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.
Tue, Jul 31, 2018, 10:25 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View