వీధుల్లో సీవీలు పంచిన టెక్కీ.. ప్రముఖ సంస్థల నుంచి 200 జాబ్ ఆఫర్లు!
Advertisement
ఉండేందుకు తనకంటూ ఓ ఇల్లు లేని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోసం వీధుల్లో పంచిపెట్టిన సీవీకి విశేష స్పందన లభించింది. ఏకంగా 200 మంది ఉద్యోగం ఇస్తామంటూ ఆఫర్ ఇవ్వడంతో ఆ టెక్కీ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అతడు సీవీలు పంచుతుండగా ఫొటోలు తీసిన ఓ వ్యక్తి దానిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో టెక్కీ పేరు వైరల్ అయింది. అతడి పాట్లు చూసిన చాలామంది తాము అండగా ఉంటామంటూ ఉద్యోగం ఆఫర్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిందీ ఘటన.

వెబ్ డెవలపర్ డేవిడ్ కసారెజ్‌కు ఉండేందుకు ఇల్లు లేదు. చేసేందుకు పనిలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించి విఫలమైన డేవిడ్ ఈనెల 27న ఉదయం మౌంటైన్ వ్యూలోని పెర్క్ బెంచ్‌ వీధుల్లోకి నీట్‌గా తయారై వచ్చాడు. షర్ట్ టక్ చేసి టై కట్టుకుని రోడ్డుపై నిల్చుకున్నాడు. చేతిలో పెద్ద బ్యాగ్. అందులో ముందే చేసి పెట్టుకున్న సీవీలు ఉన్నాయి. ఓ కార్డుబోర్డుపై ‘హోంలెస్, హంగ్రీ ఫర్ సక్సెస్. టేక్ ఏ రెజ్యూమ్’ అని రాసిపెట్టుకుని నిల్చున్నాడు.

రెండు గంటలపాటు అలాగే సీవీలు పంచిపెట్టాడు. అంతలో కారులో వచ్చిన జాస్మిన్ స్కఫీల్డ్ అనే యువతి అతడిని చూసి ఆగింది. దగ్గరికొచ్చి అడిగి ఫొటో తీసుకుంది. ఆ వెంటనే దానిని ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. అంతే, క్షణాల్లోనే అది వైరల్ అయింది. ఉద్యోగం కోసం అతడు పడుతున్న పాట్లు ఎన్నో సంస్థలను కదలించాయి. 26 ఏళ్ల డేవిడ్‌కు ఉద్యోగ ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. దాదాపు 200 సంస్థలు తమ సంస్థలో చేరాలంటూ ఆఫర్ చేశాయి.

అతడికి ఉద్యోగం ఆఫర్ చేసిన సంస్థల్లో గూగుల్, బిట్‌కాయిన్ డాట్‌కామ్ వంటి ప్రముఖ సంస్థలు ఉండడం గమనార్హం. ఒకేసారి కుప్పలుతెప్పలుగా ఉద్యోగాలు వచ్చిపడడంతో ఎందులో చేరాలో తేల్చుకోలేక సతమతమవుతున్నాడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
Mon, Jul 30, 2018, 09:20 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View