ట్రయల్స్ సక్సెస్.. ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. న్యూజిలాండ్ కంపెనీ సంచలనం!
Advertisement
వారానికి  ఐదు రోజుల పని గురించి సంస్థలు ఆలోచిస్తుంటే న్యూజిలాండ్‌లోని ఓ కంపెనీ దానిని నాలుగు రోజులకు కుదించి సంచలనం సృష్టించింది. ‘తక్కువ పని-ఎక్కువ ఫలితం’ విధానంలో విజయం సాధించిన సంస్థ త్వరలోనే పూర్తిస్థాయిలో నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

న్యూజిలాండ్‌కు చెందిన పెర్పెట్యుయల్ గార్డియన్ కంపెనీ ట్రస్ట్‌లకు సంబంధించిన కార్యకలాపాలను చూస్తుంటుంది. ఉద్యోగులకు మరింత వెసులుబాటు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపే అవకాశం ఇవ్వాలని భావించింది. అందులో భాగంగా వారానికి నాలుగు రోజులే పనిచేయించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య ట్రయల్స్ నిర్వహించింది. రోజు తగ్గించినంత మాత్రాన గంటలు పెంచలేదు. 8 గంటలే వారితో పనిచేయించుకుంది.

నెల రోజుల ట్రయల్స్ పూర్తయిన తర్వాత గణాంకాలు విశ్లేషిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. 240 మంది పనిచేస్తున్న ఈ సంస్థలో  78 శాతం మంది ఉద్యోగులు విజయవంతంగా విధులను-జీవితాన్ని సమతూకం చేసుకోగలిగారు. ఈ విషయంలో 24 శాతం పాయింట్లు పెరిగినట్టు గుర్తించిన యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ఉద్యోగుల్లో పని ఒత్తిడి 7 శాతం పాయింట్లు తగ్గగా.. విధుల పట్ల ప్రేరణ, నిబద్ధత, సాధికారత బాగా మెరుగయ్యాయని తేలింది. దీంతో ఇకపై వారానికి నాలుగు రోజుల పనిదినాలను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. యాజమాన్యం నిర్ణయంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

Mon, Jul 23, 2018, 10:03 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View