అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం మేటినీ షో... ముగ్గురు కీలక నటులు.. క్లైమాక్స్ ఇదే!
Advertisement
నేటి మధ్యాహ్నం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం అనే మేటినీ షో వేయబోతున్నారు. ఇందులో ముగ్గురు కీలక పాత్రధారులు ఉన్నారు. క్లైమాక్స్ అందరికీ తెలిసిందే. కానీ రక్తికట్టించేందుకు ముగ్గురూ తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్గాల వారీగా విడిపోయి మరీ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నటులు ముగ్గురూ తమ నటనతో తమ వారిని మెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. జాతీయ పత్రిక హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం యథాతథంగా...

నిప్పురవ్వ
దేశం మొత్తం చిరపరిచితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. సీనియర్ రాజకీయవేత్త. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో చాలామంది ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. విభజన హామీలను నెరవేర్చడం లేదన్న కారణంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సై అన్నారు.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీని కాంగ్రెస్ విభజించింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టి విజయం సాధించారు. ఏపీని విభజించిన కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించిన బీజేపీ ఆ తర్వాత హోదా లేదు, గీదా లేదు అనడంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. ఎన్‌డీయేకు గుడ్‌బై చెప్పేశారు. మరోవైపు ఏపీలో వైసీపీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు బీజేపీని దుమ్మెత్తి పోస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో తన పట్టును పెంచుకునేందుకు ఎన్‌డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

చాలెంజర్
అవిశ్వాస తీర్మానంలో రెండో పాత్రధారి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. బీజేపీ కాదన్న ప్రత్యేక హోదాను తాము ఇస్తామంటూ ముందుకొచ్చిన కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తోంది. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఏపీ ప్రజలకు దగ్గరవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో ప్రసంగించనున్న రాహుల్‌కు అది ఎంతో కీలకం కానుంది. ఆయన పార్టీ అధ్యక్షుడయ్యాక తొలి ప్రసంగం ఇదే.

తన ప్రసంగం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని చూస్తున్నారు. అయితే, ఫలితాన్ని తేల్చలేమని రాహుల్ కు కూడా తెలుసు. అయినప్పటికీ ‘ఆడియన్స్’ను మెప్పించేందుకు తాపత్రయపడుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా సూటు-బూటు సర్కారు అని విమర్శించే రాహుల్ లోక్‌సభలో ఏం మాట్లాడాలన్న దానిపై ఇప్పటికే సిద్ధమయ్యారు. 2019 ఎన్నికలకు అవిశ్వాస తీర్మానాన్ని ఆయుధంగా మలచుకోవాలని చూస్తున్నారు. సెంటిమెంట్లను తట్టి లేపడం ద్వారా ఏపీలో తిరిగి పట్టు సాధించాలని యోచిస్తున్నారు.

రాజు
పై ఇద్దరు నటులను పక్కనపెడితే అందరి దృష్టి మూడో నటుడిపైనే ఉంది. ఆయన మరెవరో కాదు.. ప్రధాని నరేంద్రమోదీ. ఎవరెంతగా గింజుకున్నా, ఎవరెన్ని ‘మోషన్లు’ ప్రవేశపెట్టినా తన ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్న ధీమాతో ఉన్నారు. ఆ ఆత్మవిశ్వాసం ఆయనలో అడుగడుగునా కనిపిస్తోంది. 2017 ఎన్నికల సందర్భంగా మోదీ అన్న మాటను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి.

అప్పట్లో మోదీ ఎంపీలతో మాట్లాడుతూ.. 'ఎన్నికలు యుద్ధమైతే.. నేను కమాండర్‌ను’’ అని చెప్పుకొచ్చారు. ఇక, నేడు కూడా మోదీకి యుద్ధమే. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించినప్పటి నుంచే మోదీ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు. మొత్తం చిత్రంలో ముఖ్య నటుడు అయిన మోదీ తను ఎప్పుడు తెరపైకి రావాలో ముందు నిర్ణయించుకున్నారు.  నో-కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా తనకొచ్చే నష్టం ఏమీ లేదన్న ధీమాతో ఉన్నారు. అయితే, తన సొంత ఆడియన్స్ (బీజేపీ శ్రేణులు)ను మెప్పించే పనిలో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యర్థులపై విరుచుకుపడనున్నారు. బీజేపీని గద్దెదించేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నుతున్నాయంటూ ప్రజల నుంచి సానుభూతిని పొందాలని ప్రయత్నించనున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల కోసం లైన్ క్లియర్ చేసుకోనున్నారు.

ముగింపు
ముగింపు మాత్రం అందరికీ తెలిసిందే. బీజేపీకి ఉన్న సంఖ్యా బలం ముందు అవిశ్వాస తీర్మానం బలపడదు. దీనికి తోడు సఖ్యత లేక ప్రతిపక్షాలు కొట్టుకుంటున్నాయి. బీజేపీపై నిత్యం విరుచుకుపడే శివసేన కూడా తమ మద్దతు బీజేపీకేనని తేల్చి చెప్పింది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే, లోక్‌జన్ శక్తి వంటి పార్టీలు మోదీకి జై కొట్టాయి. సో.. శుభం కార్డు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Fri, Jul 20, 2018, 11:08 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View