పచ్చబొట్టు చిచ్చు: పెళ్లయిన ఐదో రోజే.. భర్తను చెడుగుడు ఆడుకున్న భార్య!
Advertisement
పెళ్లయిన ఐదు రోజుల తర్వాత ఓ కొత్త జంట సాయిబాబా దర్శనం కోసం గుడికి వచ్చింది. దర్శనం అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. భవిష్యత్తు గురించి ఊసులాడుకున్నారు. చేతిలో చెయ్యి వేసుకుని చాలాసేపు కబుర్లాడుకున్నారు. అలా మాట్లాడుతుండగానే.. భర్త చేతిపై ఉన్న పచ్చబొట్టుపై నవ వధువు దృష్టి పడింది. పరిశీలించి చూస్తే అదో అమ్మాయి పేరు.

అంతే.. భార్య అపర కాళి అయ్యింది. ఆలయమని కూడా చూడకుండా శివమెత్తింది. ఆమె ఎవరంటూ ప్రశ్నించింది. సమాధానం చెప్పేందుకు భర్త తటపటాయిస్తుండడంతో జుట్టు పట్టుకుని చెంపలు చెడామడా వాయించింది. కాళ్లతో తంతూ, వీపుపై పిడిగుద్దులు గుద్దుతూ ఈడ్చుకెళ్లింది. దీంతో ఆలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దర్శనానికి వచ్చిన మిగతా భక్తులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఊరుకోలేదు. ఆమె ఎవరో చెప్పాలంటూ భర్తను చెడుగుడు ఆడుకుంది.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తను ఆమె కొడుతుండగా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
Fri, Jul 20, 2018, 07:27 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View