మల్టీప్లెక్స్ లపై బయటి ఫుడ్ దెబ్బ... పడిపోయిన ఐనాక్స్, పీవీఆర్ షేర్లు!
Advertisement
మల్టీప్లెక్స్ ల్లోకి వెళ్లేవారు, బయటి నుంచి తమకు నచ్చిన ఆహార పదార్ధాలను, తినుబండారాలను తీసుకెళ్ల వచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం పీవీఆర్, ఐనాక్స్ లీజర్ వంటి మల్టీ ప్లెక్స్ సంస్థల ఈక్విటీ వాటాల విలువను భారీగా దెబ్బతీసింది. ఈ కంపెనీల ఆదాయంలో మల్టీప్లెక్స్ ల్లో విక్రయించే ఆహారం, పానీయాలు అధిక వాటాను కలిగుంటాయన్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లకు బయటి ఫుడ్ ను అనుమతిస్తే, అక్కడి విక్రయాలు దారుణంగా పడిపోతాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు ఈక్విటీ విక్రయాలకు ప్రయత్నించారు. పీవీఆర్ వాటా విలువ ఒక్క రోజులోనే 13.1 శాతం, ఐనాక్స్ లీజర్ విలువ 5.43 శాతం పడిపోయాయి.

ముక్తా ఏ2 పేరిట థియేటర్ల చైన్ ను నడుపుతున్న సుభాష్ ఘాయ్ ముక్తా ఆర్ట్స్ విలువ పడిపోయి, ఆపై స్వల్పంగా తేరుకుంది. మల్టీప్లెక్స్ యజమానులు తమ ఇష్టానుసారం ఆహార పదార్థాల ఉత్పత్తుల రేట్లను పెంచేసి, ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నాయని పలు ఆరోపణలు రాగా, విచారించి, అవి నిజమేనని తేల్చిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం జనవరిలో ముంబై నివాసి జైనేంద్ర బాక్సీ, అధిక ధరల విషయాన్ని హైకోర్టుకు తన పిటిషన్ ద్వారా తెలియజేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణ దశలో ఉండగానే, ప్రభుత్వం బయటి తినుబండారాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ, తమకు ఇంకా ప్రభుత్వం నుంచి లేదా ఎటువంటి నియంత్రణా సంస్థల నుంచి ఆదేశాలు అందలేదని అంటుండటం గమనార్హం.
Sun, Jul 15, 2018, 09:49 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View