పెళ్లి విషయంలో మాకా పట్టింపులు లేవు.. మారుతున్న నవతరం మనోభావాలు.. సర్వేలో వెల్లడి
Advertisement
Advertisement
వివాహంపై యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు న్యూస్ యాప్ ‘ఇన్‌షార్ట్’ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మారుతున్న యువత మనోభావాలకు వారి అభిప్రాయాలు అద్దం పడుతున్నాయి. భారత వివాహ వ్యవస్థలో ఇప్పటి వరకు కీలకపాత్ర పోషిస్తున్న కులం విషయంలో తమకు పెద్దగా పట్టింపులు లేవని ప్రతీ పదిమందిలో 8 మంది చెప్పడం విశేషం. అమ్మాయిలైతే అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడన్నది పెద్ద విషయమే కాదని తేల్చేశారు.

దేశవ్యాప్తంగా జూన్ మూడో వారంలో ఇన్‌షార్ట్స్ ఈ సర్వే నిర్వహించగా మొత్తం 1.3 లక్షల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. కులాంతర వివాహాలు చేసుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రతీ 10 మందిలో 8 మంది చెప్పుకురాగా, పెళ్లయ్యాక అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోకపోయినా పరవాలేదని 70 శాతం కంటే ఎక్కువ మంది అబ్బాయిలు చెప్పారు.

అమ్మాయిలైతే అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడన్నది అసలు మేటరే కాదని కుండ బద్దలు కొట్టారు. భాగస్వామి ఎక్కువ సంపాదిస్తున్నాడా? తక్కువ సంపాదిస్తున్నాడా? అన్నది ఆలోచించబోమని 84 శాతం మంది అమ్మాయిలు చెప్పుకొచ్చారు. 90 శాతం మంది అబ్బాయిలైతే అమ్మాయి తరపు వారి పెళ్లి ఖర్చులు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పెళ్లి ఖర్చును కూడా భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మొత్తానికి మారుతున్న యువతరం ఆలోచనలకు ఈ సర్వే వేదికగా నిలిచిందనడం అతిశయోక్తి కాదేమో!
Fri, Jul 13, 2018, 09:21 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View