దొంగలను వెంబడించి పట్టుకున్న కానిస్టేబుల్.. ఊహించని గిఫ్ట్ తో షాకిచ్చిన ఉన్నతాధికారులు!
Advertisement
అర్ధరాత్రి వేళ చోరీ చేసి పారిపోతున్న దొంగలను నాలుగు కిలోమీటర్ల మేర వెంటాడి పట్టుకుని అరదండాలు వేసిన ఓ కానిస్టేబుల్‌కు ఉన్నతాధికారులు ఊహించని బహుమానం ఇచ్చారు. నగదు బహుమతితోపాటు హనీమూన్‌ ఎంజాయ్ చేయమంటూ చేతిలో టికెట్లు పెట్టారు. ఊహించని ఈ అదృష్టానికి ఆ కానిస్టేబుల్ తెగ సంబరపడిపోతున్నాడు.  

బెంగళూరులోని బెళ్లందూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి మొబైల్‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. గమనించిన దొంగలు అతడి ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. దీంతో బాధితుడు దొంగ దొంగ అని గట్టిగా కేకలు వేశాడు. పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్ వెంకటేశ్ అది విని దొంగల వెంట పడ్డాడు. కానిస్టే‌బుల్‌ను చూసిన దొంగలు మరింత వేగంగా పరిగెత్తారు. అయినా పట్టువదలని వెంకటేశ్ నాలుగు కిలోమీటర్ల మేర వెంటాడి వారిలో ఒకడిని పట్టుకుని బేడీలు వేశాడు.

కానిస్టేబుల్ వెంకటేశ్ ధైర్యానికి, విధుల్లో అంకితభావానికి ఫిదా అయిన పోలీసు అధికారులు అతడికి రూ.10 వేల రివార్డు ప్రకటించారు. అంతేకాదు,‌ నవంబరులో ఓ ఇంటివాడు కాబోతున్న వెంకటేశ్‌కు  కేరళ వెళ్లేందుకు హనీమూన్ ప్యాకేజీ ఇవ్వనున్నట్టు చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇతర పోలీసులు కూడా వెంకటేశ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ ప్రకటించినట్టు అధికారులు తెలిపారు.
Sun, Jul 08, 2018, 07:14 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View