మధ్యప్రదేశ్‌లో అమానవీయం.. సంపన్నులకు భార్యలను అద్దెకిస్తున్న సామాన్యులు!
Advertisement
మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసిన విషయాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. విషయం తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. గ్వాలియర్ డివిజన్‌లో పలువురు పురుషులు తమ భార్యలను సంపన్నులకు అద్దెకిస్తున్న విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు.

 సంపన్న కుటుంబాలకు చెందిన అవివాహితులు, భార్యలను కోల్పోయిన వారికి శివపురి జిల్లాలోని భర్తలు తమ భార్యలను రోజు, నెల వారీ, ఏడాది పద్ధతిలో అద్దెకు ఇస్తున్నారు. స్టాంప్‌ పేపర్‌పై రాసుకుని మరీ ఒప్పందాలు కుదర్చుకుంటుండడం విశేషం. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆ మహిళతో సంబంధాన్ని కోరుకుంటే ఒప్పందం పునరుద్ధరిస్తారు. గతంలో గుజరాత్‌లోనూ ఇటువంటి ఉదంతాలు వెలుగు చూశాయి. ఓ వ్యక్తి తన భార్యను నెలకు రూ. 8 వేలకు మరో వ్యక్తికి అద్దెకివ్వడం అప్పట్లో సంచలనమైంది.

మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో పెళ్లి పేరుతో జరుగుతున్న అరాచకాలు ఇటీవల శ్రుతి మించాయి. గిరిజన బాలికలపై కన్నేసిన బ్రోకర్లు వారికి పెళ్లిళ్లు చేస్తామని, చక్కని వరుడు ఉన్నాడని వారి తల్లిదండ్రులను ఒప్పిస్తారు. అబ్బాయి నుంచి వేలాది రూపాయలు తీసుకుని కొంత మొత్తాన్ని అమ్మాయి తల్లిదండ్రుల చేతుల్లో పెడతారు. నిజానికి ఇవి పెళ్లిళ్లు ఎంతమాత్రమూ కాదు. ఆ పేరుతో జరుగుతున్న అమ్మకాలు మాత్రమే. ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ అరాచకాలు విస్మయ పరుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
Wed, Jul 04, 2018, 07:11 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View