విద్యార్థుల పోరాటానికి దిగొచ్చిన తమిళ సర్కారు.. భగవాన్ మాస్టారి బదిలీ నిలిపివేత!
Advertisement
విద్యార్థుల పోరాటానికి ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం దిగొచ్చింది. తిరువళ్లూరు జిల్లా వెల్లియగరం గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని ఆంగ్ల ఉపాధ్యాయుడు భగవాన్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భగవాన్ మాస్టారి ఉదంతం ఇటీవల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఇటీవల ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. విషయం తెలిసిన విద్యార్థులు స్కూలు విడిచి వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

అందరికీ బై చెప్పి.. వెళ్లిపోతున్న ఆయనను పొదివి పట్టుకుని విలపించారు. కాళ్లు పట్టుకుని బతిమాలారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. అయితే, తాను తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోందని, మళ్లీ బదిలీల్లో భాగంగా ఇక్కడికే వస్తానని వారికి సర్దిచెప్పి భారమైన మనసుతో వీడ్కోలు చెప్పారు.

భగవాన్ మాస్టారును పిల్లలు పట్టుకుని బతిమాలుతున్న దృశ్యాలు, ఆయన బదిలీని తట్టుకోలేక ఏడుస్తున్న విద్యార్థుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కదిలిపోయిన విద్యాశాఖ భగవాన్ మాస్టారి బదిలీని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
Thu, Jun 28, 2018, 07:18 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View