నిర్ణీత సమయానికంటే మూడు నిమిషాల ముందుగా లంచ్.. ఉద్యోగి జీతంలో కోత.. జపాన్ లో అంతే!
Advertisement
నిర్ణీత సమయానికి కంటే మూడు నిమిషాల ముందుగానే లంచ్ కు వెళ్లిన ఉద్యోగిపై ఓ కంపెనీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతడి ఒక రోజు జీతంలో సగం కోత పెట్టడంతోపాటు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. జపాన్‌లో జరిగిందీ ఘటన. క్రమశిక్షణకు ఆ దేశంలోని సంస్థలు ఎంతటి ప్రాధాన్యం ఇస్తాయో ఈ ఘటన ద్వారా అంచనా వేసుకోవచ్చు. అయితే, కంపెనీ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాటర్ వర్క్స్ బ్యూరోలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి లంచ్‌కు నిర్దేశించిన సమయానికి మూడు నిమిషాల ముందే కుర్చీలోంచి లేచేవాడు. ఏడు నెలల కాలంలో 26 సార్లు ఇలా చేశాడు. దీనిని గమనించిన యాజమాన్యం అతడిని తీవ్రంగా మందలించింది. క్షమాపణలు చెప్పాలని ఆదేశించడంతోపాటు ఒక రోజు వేతనంలో సగం కోత విధించింది.

అయితే, కంపెనీ క్రమశిక్షణ చర్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెళ్తున్నది సిగరెట్ తాగడానికో, మరో పనికో కాదని, భోజనానికి మాత్రమేనని అంటున్నారు. మరి, బాత్రూమ్‌కు కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా? అని నిలదీస్తున్నారు. కంపెనీది పిచ్చితనమని దుమ్మెత్తిపోస్తున్నారు.
Fri, Jun 22, 2018, 09:15 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View