జేసీబీపై మమకారం.. అందులోనే అత్తారింటికి నవదంపతులు!
Advertisement
దశాబ్దకాలంగా తనకు బతుకునిస్తున్న జేసీబీపై మమకారాన్ని పెంచుకున్న ఓ యువకుడు పెళ్లిలోనూ దాని సేవలను ఉపయోగించుకున్నాడు. పెళ్లి అయిన వెంటనే భార్యతో కలిసి జేసీబీలో కూర్చుని అత్తారింటికి చేరుకున్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కర్ణాటకలోని పుత్తూరు తాలుకా పరుపుంజాలో జరిగిందీ పెళ్లి.

వరుడు చేతన్ దశాబ్దకాలంగా జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో జేసీబీతో అతడికి అనుబంధం ఏర్పడింది. తనకు ఉపాధినిస్తున్న దానిని పెళ్లిలోనూ ఉపయోగించుకోవాలనుకున్నాడు. పెళ్లయిన వెంటనే అందులోనే భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని కాబోయే శ్రీమతికి చెబితే తొలుత ఆమె ఆశ్చర్యపోయింది. తన వల్ల కాదని చెప్పేసింది. అయినా సరే, పట్టువీడని చేతన్ ఆమెను ఒప్పించాడు. అతడిపై నమ్మకంతో చివరికి ఆమె అంగీకరించింది.

వధువు ఓకే చెప్పడంతో చేతన్ స్నేహితులు జేసీబీని కడిగి శుభ్రం చేశారు. పూలదండలతో చక్కగా, అందంగా అలంకరించారు. పెళ్లి ముగిసిన వెంటనే జేసీబీ తొట్టెలో కూర్చుని కల్యాణ మండపం నుంచి అత్తారింటికి బయలుదేరారు. జేసీబీలోని నవదంపతులను చూసిన వారు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. జేసీబీతో అతడు పెనవేసుకున్న బంధంపై చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Fri, Jun 22, 2018, 06:52 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View