బాబుకు పేరు పెట్టేందుకు ఎన్నిక నిర్వహించిన తల్లిదండ్రులు.. ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే!
Advertisement
Advertisement
తాము తల్లిదండ్రులం అవుతున్నామని తెలియగానే పుట్టే బిడ్డకు పేరు కోసం వెతుకులాడుతారు. ఆ పేరు అందరి కంటే భిన్నంగా, వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. నచ్చిన పేర్లు ఎంచుకుని అందులో కుటుంబ సభ్యులందరికీ ఆమోదయోగ్యమైన దానిని ఎంపిక చేసుకుంటారు. సాధారణంగా జరిగేది ఇదే. కానీ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఓ దంపతులకు ఈ విషయంలో పెద్ద చిక్కొచ్చి పడింది.

మిథున్-మాన్సి దంపతులకు ఏప్రిల్ 5న బాబు పుట్టాడు. నామకరణం కోసం మూడు పేర్లు ఎంపిక చేసుకున్నారు. యక్ష్, యువాన్, యువిక్ అని మూడు పేర్లను ఫైనల్ చేశారు. కానీ ఆ మూడింటిలో ఏ పేరు పెట్టాలి? ఎంత ఆలోచించినా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇక లాభం లేదని ఏకంగా ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ‘బాలక్‌ నామ్‌ ఛయాన్‌ ఆయోగ్’‌ పేరుతో ఎన్నిక బ్యానర్లు ఏర్పాటు చేసి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులను ఆహ్వానించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ నానా పటేల్, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు.

ఈ నెల 15న నిర్వహించిన పోలింగ్ కోసం ప్రత్యేకంగా బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేశారు. వారు ఎంపిక చేసిన మూడు పేర్లను బ్యాలెట్ పత్రాల్లో ముద్రించారు. ఈ ఎన్నికలో మొత్తం 192 మంది ఓటేశారు. అందులో 92 ఓట్లు యువాన్‌కు రావడంతో దంపతులు తమ కుమారుడికి అదే పేరు పెట్టారు.
Tue, Jun 19, 2018, 07:13 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View