నిశిరాత్రి వేళ సమావేశానికి రమ్మని పిలిచారు.. టీడీపీ ఎత్తుగడలో భాగం కాలేం!: పవన్ కల్యాణ్

27-03-2018 Tue 09:50
advertisement

ప్రత్యేకహోదాకు సంబంధించి అఖిలపక్ష, అఖిల సంఘాల సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెదవి విరిచారు. ఈ సమావేశాన్ని ఓ రాజకీయ ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం.

"ఏదైనా పనికి సంకల్పం బలంగా ఉంటేనే ఫలితం గొప్పగా  ఉంటుందంటారు మన  పెద్దలు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అఖిలపక్షం సమావేశానికి అటువంటి సంకల్పమే లోపించింది. సోమవారం సంధ్య ముగిసేవేళ, నిశిరాత్రి వేళ.. మంగళవారం సమావేశానికి రా..రమ్మని అనుచరులతో ఆయన కబురు పంపారు. తొలుత ఈ సమావేశం అఖిల సంఘాలకు మాత్రమే అని ప్రచారం చేసి, చివరికి పనిలో పనిగా రాజకీయ పార్టీలను కూడా కలిపేశారు.

ఈ సమావేశం నిర్వహణను కేవలం 'తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడ'గానే జనసేన భావిస్తోంది. ప్రత్యేక హోదా దక్కక ఆగ్రహంతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ లోని అయిదు కోట్ల మందిని మరోసారి మభ్యపెట్టడానికే ఈ సమావేశం అని జనసేన పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది. ప్రజలను వంచించే ఎటువంటి చర్యనైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించుకుంది.

ప్రత్యేక హోదాపై బీజేపీ సర్కారు నాన్చుడు ధోరణిని అవలంబిస్తోందని తెలిసిన తొలినాళ్లలోనే... అంటే కనీసం మూడేళ్ళ కిందటే ఏర్పాటు చేయవలసిన అఖిలపక్ష సమావేశాన్ని... అంతా అయిపోయాక, కాలం తీరిన తర్వాత మందు వేసినట్లు ఇప్పుడు ఏర్పాటు చేస్తే ఎటువంటి ఫలితం ఉండదని తెలుగుదేశానికి కూడా తెలుసు. ప్రజల ఆగ్రహం అర్థమయ్యాక తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు మీ పాపాన్ని మాకు పంచడానికేగా ఈ సమావేశం? ఇటువంటి  కంటి తుడుపు సమావేశాలు జనసేనకు ఆమోదయోగ్యం కావు. ప్రజలకు మేలు చేసే చర్యలను చేపట్టినప్పుడు మాత్రమే జనసేన అండగా ఉంటుంది. వారు ఏ పార్టీ అన్నది జనసేనకు అనవసరం.

ప్రస్తుత తరుణంలో ప్రజాప్రతినిధులే హోదా సాధించే భారాన్ని మోయాలి. ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు గారు  చేయవలసింది ప్రజాప్రతినిధులతో కలసి ఢిల్లీ బాట పట్టడమే. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగండి. తమిళ రైతులు ఢిల్లీ నడి వీధిలో చేసిన ఆందోళన స్ఫూర్తిగా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించండి. ఇదంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసికట్టుగా చేయవలసిన ప్రజాకార్యం. ఎందుకంటే, మేము మీకు ఓట్లు వేసి గెలిపించాము గనుక. రాజ్యాంగపరమైన బాధ్యత మీపై వుంది కనుక. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగి రాదో చూద్దాం. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. జైహింద్"

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement