ఫోన్ లో గేమ్స్ డౌన్ లోడ్ చేసుకోకుండానే ఆడి చూడొచ్చు.. గూగుల్ ప్లే ఇన్ స్టంట్ తో త్వరలో కొత్త సదుపాయం!
Advertisement
మన స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాం. అప్పుడప్పుడూ కొత్త గేమ్స్ డౌన్లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకుని ఆడుకుంటుంటాం. అవి నచ్చకపోతే మళ్లీ అన్ ఇన్ స్టాల్ చేయాలి. ఇదంతా పెద్ద పని. దీనికితోడు తెలియని గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫోన్ లో పర్మిషన్లు ఇవ్వడం వల్లన సెక్యూరిటీ సమస్య కూడా. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా.. ఏదైనా గేమ్ ను ఇన్ స్టాల్ చేసుకోకుండానే, అసలు డౌన్లోడ్ చేసుకోకుండానే ఆడి చూసే అవకాశం అందుబాటులో రాబోతోంది. గూగుల్ ప్లే ఇన్ స్టంట్ పేరిట ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో వివరాలు వెల్లడించింది.

గూగుల్ ప్లేలో రోజురోజుకూ పదుల సంఖ్యలో కొత్త కొత్త గేమ్స్ వచ్చి చేరుతున్నాయి. అయితే ఏ గేమ్ ఎలా ఉంటుందో తెలియదు. వాటికి సంబంధించిన వీడియోలను అందుబాటులో ఉంచినా.. మనం నేరుగా ఆడి చూసిన అనుభూతి ఉండదు. దాంతో డౌన్లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోక తప్పని పరిస్థితి. ఇలాంటి సమయంలో గూగుల్ ప్లే ఇన్ స్టంట్ ను ప్రవేశపెడుతోంది. ఇందులో ప్రతి గేమ్ కింద ‘Try Now’ బటన్ ఉంటుందని.. దాని ద్వారా ఆ గేమ్ లో కొన్ని ప్రారంభ లెవల్స్ వరకు గేమ్ ఆడి చూడవచ్చని గూగుల్ సంస్థ తెలిపింది.

ట్రయల్ బటన్ తో పాటు సదరు గేమ్ కు సంబంధించిన యూట్యూబ్ వీడియోలను, ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు కొత్తగా ‘Arcade’ ఆప్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ గా కొందరు డెవలపర్ల పరిశీలనలో ఉందని.. త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
Tue, Mar 20, 2018, 04:44 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View