మరో 20 ఏళ్లలో అరుణగ్రహంపైకి మానవులు
Advertisement
అరుణగ్రహంపై మానవ జీవనానికి సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు నాసా, ఇస్రో లాంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఇప్పటివరకు ప్రయోగాలు చేపట్టాయి. ఇవన్నీ మానవ రహితమైనవి. అయితే వచ్చే 20 ఏళ్లలో మానవులు అంగారక గ్రహంపై అన్వేషణలు సాగించగలరని బ్రిటీష్ వ్యోమగామి టిమ్ పీక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఈ నెల మొదట్లో 'ఫాల్కన్ హెవీ' పేరుతో చేపట్టిన భారీ రాకెట్ ప్రయోగం విజయవంతమయిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఓ నూతన శకం ఆవిష్కృతమయిందని మేజర్ పీక్ అన్నారు.

ఫాల్కన్ హెవీ రాకెట్‌ను ఫ్లోరిడాలోని కేప్ కనావెరాల్ నుంచి ఈ నెల మొదట్లో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. 2030 ఆఖర్లో అంగారక గ్రహంపై మనుషులు కాలుమోపే అవకాశముందని ప్రభుత్వ అంతరిక్ష ప్రయోగ సంస్థలు అంచనా వేశాయని, అయితే ఫాల్కన్ హెవీ ఎయిర్‌క్రాఫ్ట్ వల్ల ఆ శుభతరుణం అంతకంటే ముందే సాధ్యం కాగలదని ఆయన అంటున్నారు.

మరోవైపు అంగారక గ్రహంపైకి మానవసహిత ప్రయోగాల కోసం పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు సంయుక్తంగా చేపడుతున్న 'డీప్ స్పేస్ గేట్‌వే (డీఎస్‌జీ)' అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టు కూడా రోదసిలో భవిష్యత్‌లో మానవ పరిశోధనలకు కీలకం కానుందని ఆయన అన్నారు. డీఎస్‌జీ నిర్మాణ పనులు బహుశా 2022లో మొదలయ్యే అవకాశముందని ఆయన భావిస్తున్నారు.
Wed, Feb 28, 2018, 10:34 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View