నిద్ర సరిగా పట్టడం లేదా...? అయితే గుండెకు ముప్పే...!: తాజా అధ్యయనంలో వెల్లడి
Advertisement
కంటినిండా నిద్ర, కడుపుకు సరిపడా తిండి..ఈ రెండింటిలో ఏ ఒక్కటి తేడా వచ్చినా శరీరం సమ తుల్యతను కోల్పోతుంది. ఫలితంగా శరీరంలో అనూహ్య మార్పులు, అనారోగ్యం మనిషిని ముప్పుతిప్పలు పెడుతాయి. అసలు ఒక్క రోజు రాత్రి నిద్ర సరిగా పట్టకుంటేనే మరుసటి రోజు నరకప్రాయంగా ఉంటుంది. అలాంటిది కొందరు నెలలు తరబడి, మరికొందరు ఏళ్లతరబడి నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వారి బాధ వర్ణనాతీతం. ఇందుకు మానసిక సమస్యలే ప్రధాన కారణాలని వైద్యులు చెబుతుంటారు. ఒకవేళ నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉంటే ఏమవుతుంది? అనే సందేహాలకు సమాధానంగా, అది భవిష్యత్తులో హృద్రోగానికి దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దాదాపు 13 వేల మంది నిద్ర అలవాట్లను పర్యవేక్షించిన అనంతరం జపనీస్ అధ్యయనం ఒకటి నిద్రలేమితో వచ్చే సమస్యలను వెల్లడించింది. ఈ సమస్య కార్డియోవాస్కులర్ వ్యాధికి దారిస్తుందని తమ అధ్యయనంలో వెల్లడైందని హిరోషిమా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు డాక్టర్ నొబు ససాకి బార్సిలోనాలో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సదస్సులో పేర్కొన్నారు. నిద్రలేమి సమస్యకు కొన్ని ఉపాయాలను కూడా సూచించారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, సమీకృత ఆహారం తీసుకోవడం, మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం లాంటి మార్పులతో ఒత్తిడిని తగ్గించుకుంటే నిద్ర క్రమంగా పట్టే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.
Tue, Feb 27, 2018, 05:27 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View