ఆకాశం నుండి కోట్లాదిగా వైరస్‌ల వర్షం..!
Advertisement
Advertisement
ఆశ్చర్యం కలిగించే రీతిలో భూ వాతావరణం చుట్టూ అసంఖ్యాక వైరస్‌లు ఆవరించి ఉన్నాయి. అవి అక్కడ నుండి తిరిగి భూమిపైకి చేరుకుంటున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. జన్యుపరంగా సారూప్యత ఉన్న వైరస్‌లు తరచూ భూగోళం చుట్టూ ఆవరించిన చాలా భిన్నమైన వాతావరణాల్లో కన్పిస్తుండటాన్ని ఈ అధ్యయనం వివరిస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఈ అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు తొలిసారిగా భూవాతావరణం నుండి స్వేచ్ఛా ట్రోపోస్పియర్‌లోకి చేరుకుంటున్న వైరస్‌ల పరిమాణాన్ని గుర్తించగలిగారు. అయితే ఈ వైరస్‌లు తిరిగి భూ ఉపరితలంపైకి చేరుకోవడానికి ముందుగా అవి వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంటాయని వారు తెలిపారు.

"ప్రతిరోజూ, గ్రహ సరిహద్దు పొరపైన ఒక్కో చదరపు మీటరుకు 800 మిలియన్లకు పైగా వైరస్‌లు ఆవరిస్తున్నాయి. అంటే, కెనడాలో ఒక్కో వ్యక్తి 25 రకాల వైరస్‌లకు గురవుతున్నాడు" అని కెనడాలోని యూనివర్శటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్న కర్టిస్ సటిల్ అన్నారు.

 "ఒక ఖండంపై ఉన్న వాతారణంలోకి చేరిన ఒక వైరస్ మరో ఖండంలోకి ప్రవేశిస్తుందన్న సంగతిని తేలికగా గ్రహించగలం" అని ఆయన చెప్పారు. ఈ పరిశోధన తాలూకూ వివరాలను ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మైక్రోబయాల్ ఈకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. దుమ్ముధూళి, సముద్రంలో ఎగసిపడే అతిపెద్ద అలల నుండి ఉత్పన్నమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లు వాతావరణంలోకి చిన్న చిన్న కణాల రూపంలో చేరుకుంటాయి. స్

పెయిన్‌లోని సియర్రా నెవడా మౌంటెన్స్‌లో ఉన్న సదుపాయాలను ఉపయోగించి ప్రతిరోజూ ఒక్కో చదరపు మీటరు మేర ఆవరిస్తున్న కోట్లాది వైరస్‌లు, లక్షలాది బ్యాక్టీరియాలను గుర్తించామని పరిశోధకులు తెలిపారు. బ్యాక్టీరియాల కంటే వైరస్‌లే ఎక్కువ మేర ఆవరిస్తున్నాయన్నారు.

"వర్షాలు, సహారా ఎడారి నుండి వచ్చే ధూళి కణాల ద్వారా బ్యాక్టీరియా, వైరస్‍‌లు విలక్షణమైన రీతిలో భూవాతావరణంలోకి చేరుతున్నాయి. ఏదేమైనప్పటికీ, భూ వాతావరణం నుండి వైరస్‌లను దూరం చేయడంలో వర్షాలు అంత సమర్థవంతంగా పనిచేయలేవు" అని గ్రెనడా యూనివర్శిటీకి చెందిన ఇసాబెల్ రిచీ తెలిపారు.

అంతేకాక సాధ్యమైనంత ఎక్కువగా ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర అలల నుండి వైరస్‌లు గాలిలోకి చేరుకుంటున్నఆనవాళ్లను కూడా గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. గాలి, గ్యాస్‌లోని చిన్న, తేలికపాటి, కర్బన సంబంధిత కణాలపై వైరస్‌లు చేరుకుంటుంటాయని, అలాంటి వైరస్‌లు వాతావరణంలో చాలా కాలంపాటు తిష్ట వేస్తాయని వారు తెలిపారు.
Fri, Feb 09, 2018, 04:51 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View